ఊరించి.. ఉసూరుమనిపించి…
-ఇదిగో, అదిగో అంటూ మంత్రి వర్గ విస్తరణ వాయిదా
-మంచిర్యాల నుంచి ముగ్గురు ఎమ్మెల్యేల పోటీ
-పార్టీని అంటిపెట్టుకుని తమ నేతకే పదవి వస్తుందని పీఎస్ఆర్ వర్గం ధీమా
తమ నేతకే ఢిల్లీలో పరిచయాలంటూ వినోద్, వివేక్ వర్గం ఆలోచన
ఎప్పటికి తేలేనో ఈ మంత్రి వర్గ విస్తరణ అంటూ కేడర్‌లో అసంతృప్తి
అదిగో మంత్రి పదవి… ఇదిగో మంత్రి పదవి.. ఆ పండక్కి మంత్రి వర్గ విస్తరణ.. ఈ పండక్కి మంత్రి వర్గ విస్తరణ.. పదవి ఆశించే వారికి అధిష్టానం ఆశ పెడుతోంది.. మంత్రి పదవి విషయంలో ఎటూ తేల్చకుండా నానుస్తుండటంతో అటు ఆశావహులతో పాటు వారి అనుయాయుల్లో సైతం అసంతృప్తి వ్యక్తం అవుతోంది. ముఖ్యమంత్రి కూడా ఈ వ్యవహారం ఎటూ తేల్చు లేకపోవడంతో మంత్రి పదవిపై క్లారిటీ రావడం లేదు. ఈ వ్యవహారం ఢిల్లీ అధిష్టానానికే వదిలేసినట్లు అర్థం అవుతోంది.
కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు దీరాక ఉమ్మడి ఆదిలాబాద్‌కు మహర్ధశ పడుతుందని అంతా అనుకున్నారు. అందులో భాగంగా ఇక్కడ నేతలకు మంత్రి వస్తుందని భావించారు. కానీ, అందుకు విరుద్ధంగా ముఖ్యమంత్రి ఈ జిల్లాకు మంత్రి పదవి ఇవ్వలేదు. ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన మంత్రి పదవుల కేటాయింపు ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. పక్కనే ఉన్న కరీంనగర్ జిల్లాకు రెండు, వరంగల్‌కు రెండు, ఖమ్మం జిల్లాకు ఏకంగా మూడు మంత్రి పదవులు ఇచ్చారు. కానీ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు కనీసం ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వలేదు. మంచిర్యాల జిల్లాలో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసి మరి ముగ్గురు ఎమ్మెల్యేలుగా గెలిచారు. అయినా, ఇక్కడ పదవి ఇవ్వకపోవడం పట్ల పార్టీ శ్రేణుల్లో నిరాశ, నిస్పృహలు వ్యక్తం అవుతున్నాయి.
పోటీలో ముగ్గురు ఎమ్మెల్యేలు..
మంత్రి పదవి కోసం మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్ రావు, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్, బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ ఎవరి ప్రయత్నాలు వారు ముమ్మరం చేశారు.. చేస్తున్నారు కూడా… బుగ్గ కారు కోసం నేతలు విపరీతంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మంత్రి పదవి లొల్లి కాస్త గల్లీ నుంచి ఢిల్లీ వరకు చేరింది . ఏఐసీసీ ఎవరికి ఓకే చెప్పితే వారికే పదవి వరించబోతోంది. రాష్ట్రంలో ఆరు బెర్తులు ఖాళీగా ఉన్నాయి. ఈ దఫాలో వాటిని భర్తీ చేయాలనేది కాంగ్రెస్ పార్టీ ఆలోచన. అధిష్టానం డిల్లీ స్థాయిలో దఫదఫాలుగా కసరత్తు చేసింది. అయితే వీరిద్దరిలో పదవి ఎవరికి అనే సస్పెన్స్ మాత్రం ఎన్నో రోజులుగా వీడటం లేదు. ఈ ముగ్గురూ తమ గాడ్‌ఫాదర్ల చుట్టూ తిరుగుతూ పదవి కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మంచిర్యాల నుంచి గెలుపొందిన ప్రేంసాగర్‌రావు 2007-13 వరకు ఉమ్మడి ఆదిలాబాద్ ఎమ్మెల్సీగా పనిచేశారు. గడ్డం వినోద్ 2004లో చెన్నూరు ఎమ్మెల్యేగా ఎన్నికకాగా 2009 వరకు కార్మికశాఖ మంత్రిగా పని చేశారు. గడ్డం వివేక్ 2009-14 వరకు పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడిగా సేవలందించారు.
అదిగో.. ఇదిగో అంటూ దాటవేత..
నేతలను ఊరిస్తున్న మంత్రి పదవి విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఢిల్లీ అధిష్టానం సైతం ఎప్పటికప్పుడు దాట వేస్తున్నారు. ప్రతి నెలలో ఇప్పుడో అప్పుడో మంత్రి వర్గ విస్తరణ అంటూ ఊరిస్తున్నారు. దసరా సమయంలో విస్తరణ ఉంటుందని, ఆ తర్వాత దీపావళికి విస్తరణ అని, ఇప్పుడు తాజాగా సంక్రాంతిలోపు అంటూ ఊదరగొట్టారు. నాలుగు రోజుల కిందట ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లిన నేపథ్యంలో మంత్రి వర్గ విస్తరణ గురించి అధిష్టానంతో చర్చించారనే వార్తలు వచ్చాయి. కానీ, ముఖ్యమంత్రి తాను అధిష్టానంతో మంత్రి వర్గ విస్తరణ గురించి చర్చించలేదని, ఆ విషయాన్ని అధిష్టానానికే వదిలేశానని చెప్పుకొచ్చారు. మరి ఆ మంత్రి వర్గ విస్తరణ ఎప్పుడనేది తేలడం లేదు. తమ జిల్లాకు మొండి చేయి చూపటం పట్ల మంచిర్యాల జిల్లా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తమ ప్రయత్నాలు ఆపని ముగ్గురు నేతలు..
తమకు మంత్రి పదవి కావాలని ముగ్గురు నేతలు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు నస్పూర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వస్తే ప్రేంసాగర్‌రావుకు మంత్రి ఇవ్వనున్నట్లు ఖర్గే ప్రకటించారు. దీంతో ప్రేంసాగర్‌రావు అదే విషయాన్ని గుర్తు చేస్తున్నారు. వినోద్, వివేక్‌లకు సైతం ఢిల్లీలోని పార్టీ అగ్రనేతలతో ఉన్న సంబంధాలను దృష్టిలో పెట్టుకుని మంత్రి పదవి దక్కించుకునేందుకు మంతనాలు సాగిస్తున్నారు. ప్రేమ్ సాగర్ రావ్ ముందునుంచి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. వినోద్ , వివేక్ ప్రతి ఎన్నికల్లో ఏదో ఒక్క పార్టీలో ఉన్నారు. పలు పార్టీలు మారిన వీరు చివరకు అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వినోద్, వివేక్ కాకా కుటుంబం అనే కారణంతోనే రెండు టికెట్లు దక్కించుకున్నారు.
పార్టీని గట్టెక్కించిన పీఎస్ఆర్.. పార్టీలు మారిన అన్నాదమ్ములు..
పార్టీ కోసం పనిచేయడమే కాదు కష్టాల్లో ఉన్న కాంగ్రెస్ ను గట్టెకించింది ఎవరంటే ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ప్రేమ్ సాగర్ రావ్ పేరే వినిపిస్తుంది. ఎందుకంటే పార్టీలో ఏమి లేదని చాలామంది అధికార పార్టీ బీఆర్ఎస్ లోకి, బీజేపీలోకి వెళ్లిపోయారు. ఆ సమయంలో పార్టీకి పెద్దదిక్కుగా ఉన్నది పీఎస్ఆర్. రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న రేవంత్ రెడ్డి మొదటి సభ ఇంద్రవెల్లి దండోరా. ఆ సభను విజయవంతం చేసి, రేవంత్‌రెడ్డితో శభాష్ అనిపించుకున్నారు. ఆ తర్వాత పిప్పిరి నుంచి భట్టి విక్రమార్క పాదయాత్ర ప్రారంభిస్తే ఉమ్మడి జిల్లాలో 30 రోజుల సుదీర్షకాలం సాగిన యాత్రను సక్సెస్ చేసి రాష్ట్రం కాంగ్రెస్ బతికే ఉందనే సంకేతాలను మిగతా పార్టీలకు పంపించగలిగారంటే అది ఉమ్మడి జిల్లాలోని నేతల చలువే. భట్టి పాదయాత్రలో భాగంగా మంచిర్యాల నిర్వహించిన సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లి ఖార్జున ఖర్గేను తీసుకొచ్చి భారీ బహిరంగ సభను విజయవంతం చేయగలిగారు. మంచిర్యాల సభ పాదయాత్ర, రేవంత్ రెడ్డి ఇంద్రవెల్లి దండోరాతో కాంగ్రెస్ పార్టీకి కొత్త జవసత్వాలు ఇచ్చిందనడంలో ఎలాంటి సందేహాలు లేవు. ఇలా ఉమ్మడి జిల్లాలో ఏ కార్యక్రమం చేపట్టినా దాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తారనే పేరు తెచ్చుకున్నది పీఎస్ఆర్.
ఒక ఇంటి నుంచి ముగ్గురు.. మళ్లీ మంత్రి పదవా..?
ఇక చెన్నూరు ఎమ్మెల్యే వివేక్, ఆయన సోదరుడు బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ సైతం మంత్రి పదవి కోసం పోటీ పడుతున్నారు. వీరిద్దరికి టిక్కెట్టు ఇచ్చిన అధిష్టానం ఆ తర్వాత వివేక్ కుమారుడు వంశీకి సైతం పెద్దపల్లి ఎంపీ టికెట్ ఇచ్చింది.ఇక మళ్లీ అదే కుటుంబంలో మంత్రి పదవి కోసం పోటీ పడుతుండటం సొంత పార్టీ నేతలతో పాటు క్యాడర్ కు సైతం నచ్చడం లేదు. ఇప్పటికే కుటుంబ పాలన అనే పేరు కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఈ నేపథ్యంలో ఇద్దరికి ఎమ్మెల్యే టిక్కెట్లు, వారి కుమారుడికి ఎంపీ టిక్కెట్టు ఇవ్వడమే కాకుండా ఇప్పుడు మళ్లీ వారిలో ఒకరికి మంత్రి ఇవ్వడం అంటే అటు పార్టీ శ్రేణులకు, ఇటు ప్రజలకు ఏం సంకేతాలు ఇస్తారనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రతి రోజూ ఇదే వాదన సాగుతోంది. మరి అధిష్టానం పార్టీ విధేయత చూస్తుందా…? పైసల బలం చూస్తుందా…? అనేది కొద్ది రోజుల్లో తేలిపోనుంది.
ఇలా నేతలు తమ పంతం వీడకుండా మంత్రి పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అధిష్టానం మాత్రం ఇదిగో, అదిగో అంటూ కాలాయాపన చేస్తోంది. మరి ఆ మంత్రి వర్గ విస్తరణ ఎప్పుడు ఉంటుందోనని పలువురు నేతలు ఆశగా ఎదురుచూస్తున్నారు.