అసెంబ్లీలో రచ్చ.. రచ్చ..
TG Assembly : ఫార్ములా-ఈ రేసు కేసులో మాజీ మంత్రి కేటీఆర్ పై కేసు విషయంలో తెలంగాణ అసెంబ్లీ దద్దరిల్లింది. సభ ప్రారంభం కాగానే.. భూ భారతి అంశంపై చర్చ ప్రారంభం అయ్యింది. దానిని లెక్క చేయకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. ఫార్ములా-ఈ రేసు కేసుపై సభలో చర్చించాలని డిమాండ్ చేశారు. ఆందోళనకు దిగారు. సభలో తమకు కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చెప్పు చూపించారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆరోపించారు. దళిత ఎమ్మెల్యేలకు చెప్పు చూపించారని ఆరోపించారు. షాద్‌నగర్ ఎమ్మెల్యేపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది.
నల్ల బ్యాడ్జీలు, ఫ్లకార్డ్‌లతో అసెంబ్లీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. 420 కాంగ్రెస్ ఇచ్చిన బూటకపు హామీలను ప్రశ్నించినందుకే అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. ఫార్ములా- ఈ పైన కేసు అక్రమం అంటూ ప్లకార్డుల ప్రదర్శన, నినాదాలు చేశారు. దీంతో అసెంబ్లీ రణరంగంగా మారింది. దళిత ఎమ్మెల్యేలకు చెప్పు చూపించారని మండిపడ్డారు. షాద్‌నగర్ ఎమ్మెల్యేపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. దీంతో అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. స్పీకర్ పోడియం వైపు బీఆర్ఎస్ సభ్యులు దూసుకెళ్లారు. వారిని మార్షల్స్ అడ్డుకున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ సభ్యుల మధ్య తోపులాట జరిగింది. ఒకరిపై ఒకరు వాటర్ బాటిల్స్, పేపర్లు విసురుకున్నారు. ఒక్కసారిగా సభలో గందరగోళం నెలకొంది. దాంతో సభను 15 నిమిషాల పాటు అసెంబ్లీ స్పీకర్ వాయిదా వేశారు.
స్పీకర్‌పై బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పేపర్ల కట్ట విసిరారని కాంగ్రెస్ సభ్యులు అంటున్నారు. కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కూడా పేపర్లు చింపి విసిరేశారు. స్పీకర్ పోడియం మెట్లపైకి హరీష్‌రావు వెళ్లారు. పాడి కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేల వైనపుకు దూసుకురావడంతో కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చేయి చూపించి హెచ్చరించారు. షాద్‌నగర్ ఎమ్మెల్యేపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని బీఆర్ఎస్ సభ్యులు డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దళిత స్పీకర్‌ను అవమానించేలా సభలో వ్యవహరించారని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అంటున్నారు. క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
షాద్ నగర్ ఎమ్మెల్యే శంకరయ్య అసభ్యంగా ప్రవర్తించడం వల్లే తాము పేపర్లు విసిరామని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంటున్నారు. ఐతే.. స్పీకర్ ఛాంబర్ దగ్గర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు. దళిత స్పీకర్‌ని అవమానించారని మండిపడ్డారు. కేటీఆర్ జైలుకు వెళ్తారనే భయంతోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇలా చేస్తున్నారు అని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సెటైర్ వేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చేష్టలు చూస్తుంటే, తాగి వచ్చాడేమో అనే డౌట్ వస్తోందని వేముల వీరేశం ఆరోపించారు. ఇలా సభలో కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడింది.
కేటీఆర్‌ను అప్రతిష్టపాలు చేసి బీఆర్‌ఎస్‌ను (BRS) ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు. అసెంబ్లీ నడిచే సమయంలో ఒక ఎమ్మెల్యేపై అక్రమ కేసు పెట్టారని చెప్పారు. ఫార్ములా-ఈ కార్ రేస్ అంశంలో స్పీకర్ చాంబర్‌లో కలిసి విజ్ఞప్తి చేశామన్నారు. ఫార్ములా-ఈ కార్ రేస్ అంశంలో రకరకాల లీకులు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. తాము ఎలాంటి తప్పు చేయలేదన్నారు. రాష్ట్ర ఆదాయాన్ని పెంచేందుకు ఫార్ములా-ఈ రేస్ నిర్ణయం తీసుకున్నామన్నారు. తాము తప్పు చేశామంటున్నారని, సభలో చర్చించి అదేదో చెప్పాలని డిమాండ్ చేశారు. తాము చేసింది ఎందుకు తప్పుకాదో ఈ సభ ద్వారా మేం కూడా ప్రజలకు చెబుతాం. మీరు పెట్టింది అక్రమ కేసు కాకుంటే ఈ సభలో చర్చించాలన్నారు. కాంగ్రెస్ 420 హామీలపై నిలదీస్తున్నందుకు, లగచర్ల రైతుల తరఫున పోరాటం చేస్తున్నందుకు కేటీఆర్‌పై కేసు పెట్టారని విమర్శించారు. ఈ క్రమంలో సభ సజావుగా నడిచేందుకు సహకరించాలని స్పీకర్ విజ్ఞప్తి చేశారు. భూ భారతి బిల్లుపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చర్చను ప్రారంభించడంతో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం ముందు ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో సభను స్పీకర్ వాయిదా వేశారు.