కార్పొరేష‌న్‌గా మంచిర్యాల

- శ‌నివారం అసెంబ్లీలో కీల‌క బిల్లు
- రెండు మున్సిపాలిటీలు, 8 పంచాయతీలు విలీనం
- ఇప్ప‌టికే ప్రభుత్వానికి నివేదిక‌లు పంపిన అధికారులు
- జనవరి లేదా ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వచ్చే చాన్స్
- హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్న మంచిర్యాల ప్ర‌జ‌లు
- ముఖ్య‌మంత్రి, ఎమ్మెల్యే ప్రేంసాగ‌ర్ రావు చిత్ర‌ప‌టానికి పాలాభిషేకాలు
- గ‌తంలోనే కార్పొరేష‌న్ ఏర్పాటు కోసం ప్ర‌భుత్వం అడుగులు
- రాజ‌కీయ కార‌ణాల‌తో అడ్డుకున్న మాజీ ఎమ్మెల్యే దివాక‌ర్‌రావు

Mancherial converted into a Corporation: మున్సిపాలిటీగా ఉన్న మంచిర్యాల మున్సిపల్‌ కార్పొరేషన్ గా అప్‌గ్రేడ్ కానుంది. దీనికి సంబంధించిన బిల్లు శనివారం తెలంగాణ అసెంబ్లీ ముందుకు రానుంది. ముఖ్య‌మంత్రి రేవంత్‌ రెడ్డి అసెంబ్లీలో స్వ‌యంగా ఈ బిల్లు ప్రవేశ పెట్టనున్నారు.

మంచిర్యాల వాసుల క‌ల ఎట్ట‌కేల‌కు నెర‌వేర‌బోతోంది. ఎన్నో ఏండ్లుగా మున్సిపాలిటీగా ఉన్న మంచిర్యాల కార్పొరేష‌న్‌గా మార‌నుంది. ఈ మేర‌కు ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకోవ‌డ‌మే కాకుండా, ముఖ్య‌మంత్రి బిల్లు ప్రవేశ పెట్టనున్నారు. దీంతో మంచిర్యాల కార్పొరేష‌న్ గా అవ‌త‌రించ‌నుంది. మంచిర్యాలను నగర పాలక సంస్థగా మార్చేందుకు సాధ్యాసాధ్యాలపై ఆరా తీసిన ప్రభుత్వం చ‌క‌చ‌కా ప‌నులు చేయించింది. మంచిర్యాల జిల్లా క‌లెక్ట‌ర్ కుమార్ దీప‌క్ కార్పొరేషన్ ఏర్పాటు కోసం రెండు నెలల కిందట నివేదిక‌లు పంపారు. దీనిపై స్పందించిన సీడీఎంఏ కార్పొరేషన్ ఏర్పాటుకు అవసరమైన పూర్తి వివరాలను పంపాలని ఆదేశిస్తూ నెల రోజుల కింద‌ట‌ మున్సిపల్ అధికారులకు లెటర్ రాసింది. ఈ మేరకు మున్సిపాలిటీలు, గ్రామాల్లో జనాభా, ఓటర్లు, కుటుంబాలు, పన్నుల ద్వారా వచ్చే ఆదాయం, సాగుభూములు, వ్యవసాయేతర భూములు, సాగునీటి వనరులు తదితర వివరాలపై అధికారులు సర్వే చేస్తున్నారు.

రెండు మున్సిపాలిటీలు, ఎనిమిది గ్రామపంచాయ‌తీలు..
మంచిర్యాల, నస్పూర్ మున్సిపాలిటీతో పాటు హాజీపూర్ మండలంలోని ఎనిమిది గ్రామ పంచాయతీలను విలీనం చేస్తూ ఈ ప్రక్రియ పూర్తికాగానే మంచిర్యాల‌ను కార్పొరేష‌న్ గా ప్రకటిస్తూ నోటిఫికేషన్ విడుద‌ల చేయ‌నున్నారు. మంచిర్యాల, నస్పూర్ మున్సిపాలిటీలతో పాటు హాజీపూర్ మండలంలోని వేంపల్లి, ముల్కల్ల, గుడిపేట, చందనాపూర్, నర్సింగాపూర్, కొత్తపల్లి, పోచంపాడ్, నంనూర్ గ్రామాలను విలీనం చేయ‌నున్నారు. 2011 జ‌నాభా లెక్క‌ల ప్ర‌కారం వీటి పరిధిలో 1.63 లక్షల జనాభా ఉండగా.. ప్రస్తుతం జనాభా 2.50 లక్షలకు చేరినట్టు అంచనా. భూభాగం 150 చదరపు కిలోమీటర్ల వైశాల్యం ఉంటుంది.

గ‌తంలోనే ప్ర‌తిపాద‌న‌లు..
కోల్ బెల్ట్ కేంద్రంగా వ్యాపార వాణిజ్య కేంద్రంగా గుర్తింపు పొందిన మంచిర్యాల టౌన్ 2016లో జిల్లా కేంద్రంగా ఆవిర్భవించింది. ఆ తర్వాత వేగంగా అభివృద్ది చెందుతోంది. శివారు ప్రాంతాల్లో కొత్త కాలనీలు విస్తరించడమే కాకుండా పక్కనున్న నస్పూర్, క్యాతనపల్లి మున్సిపాలిటీలు కలిసిపోయి ఒకే ప‌ట్టణంగా మారాయి. ఈ నేపథ్యంలో నాలుగేండ్ల కిందట బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే మంచిర్యాలను కార్పొరేష‌న్‌గా చేయాలని ప్రయత్నాలు జరిగాయి. అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అరవింద్‌ కుమార్‌ జనాభా, ఆర్థిక ప్రాముఖ్యతపై నివేదిక ఇవ్వాలని 2019 ఏప్రిల్‌ 23న ఆదేశాలు జారీ చేశారు. నస్పూర్‌, క్యాతన్‌పల్లి మున్సిపాలిటీలను విలీనం చేస్తూ మంచిర్యాలను కార్పొరేషన్‌గా ఏర్పాటు చేస్తామని 2019 మార్చిలో గోదావరిఖని పర్యటనకు వచ్చిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు.

రాజ‌కీయ కార‌ణాల‌తో అడ్డుకున్న మాజీ ఎమ్మెల్యే..
మంచిర్యాల కార్పొరేష‌న్ అయితే రాజ‌కీయంగా త‌న‌కు ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని భావించిన మాజీ ఎమ్మెల్యే న‌డిపెల్లి దివాక‌ర్ రావు ఆ ప్ర‌తిపాద‌న‌ను అడ్డుకున్నారు. మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ మంచిర్యాల‌ను కార్పొరేష‌న్ చేసి దానికి తొలి మేయ‌ర్‌గా అర‌వింద‌రెడ్డి చేయాల‌ని సంక‌ల్పించారు. ఆ మేర‌కు ఆయ‌న‌కు హామీ కూడా ఇచ్చారు. ఆయ‌న మేయ‌ర్ అయితే రాజ‌కీయంగా ప‌లుకుబ‌డి త‌గ్గుతుంద‌ని భావించిన దివాక‌ర్ రావు కార్పొరేష‌న్ ప్ర‌క్రియ ముందుకు సాగ‌కుండా అడ్డుకున్న‌ట్లు ప‌లువురు చెబుతున్నారు. ఈసారి అలాటి అడ్డంకులు రాకుండా మంచిర్యాల అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని మున్సిపాలిటీలు, గ్రామాలను విలీనం చేస్తూ కార్పొరేషన్ కోసం ప్రపోజల్స్ పంపినట్టు చెప్తున్నారు. ప్రభుత్వం జనవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తుండడంతో ఈ లోపే కార్పొరేషన్ విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం ముందని భావిస్తున్నారు.

అద‌న‌పు నిధులు… కొత్త ప‌రిశ్ర‌మ‌లు..
మంచిర్యాల కార్పొరేషన్‌గా ఏర్పాటయితే ఎన్నో లాభాలు చేకూర‌నున్నాయి. కార్పొరేషన్‌గా ఏర్పాటు చేస్తే ప్రత్యేక నిధులు రావడంతో మరింతగా అభివృద్ది చెందే అవకాశాలున్నాయి. కేంద్ర ప్రభుత్వ పథకమైన అమృత్‌ లాంటి స్కీములతో రూ.100 కోట్ల మేర అదనపు నిధులు సమకూరే అవకాశం ఉంది. దీంతో నగరం మరింతగా అభివృద్ధి చెందుతుంది. ప్లాన్‌ గ్రాంటు, నాన్‌ ప్లాన్‌ గ్రాంటులతోపాటు 14, 15వ ఆర్థిక సంఘం నిధులు రానున్నాయి. కార్పొరేషన్‌గా ఏర్పాటు చేస్తే మరిన్ని పరిశ్రమలు ఏర్పాటై, యువతకు ఉద్యోగాలు లభించే అవకాశాలు ఉంటాయి.

Get real time updates directly on you device, subscribe now.

You might also like