అల్లు అర్జున్ వ్యాఖ్యలపై పోలీసులు సీరియస్
ACP ACP Vishnumurthy: ఒక్క 10 నిమిషాలు మేం ఉద్యోగాలు చేయమని వదిలిపెట్టిపోతే.. మీ బతుకులు ఎక్కడుంటాయో ఆలోచించుకోండి అని చిక్కడపల్లి ఏసీపీ విష్ణుమూర్తి ఘాటుగా వ్యాఖ్యానించారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి పోలీసులపై అల్లు అర్జున్ (Allu Arjun) వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. 15 రోజులుగా పోలీసుల మీద కొంతమంది కావాలనే బండలు వేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజలను రక్షించడంలో నిమగ్నమై ఉన్న పోలీసుల మీద అవాకులు చెవాకులు పేలుతున్నారన్నారు. డబ్బుతో మదమెక్కిన బడాబాబులు పోలీసుల ఆత్మస్థైర్యం దెబ్బతినేలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత కుటుంబాల కోసం కూడా సమయం వెచ్చించకుండా ప్రజల కోసం సేవ చేస్తోన్న పోలీసులను తిడుతున్నారని అన్నారు.
ఆ ఘటన ఒక యాక్సిడెంట్ అని, అందుకు ఎవరూ కారకులు కారని చెప్పారు. ఆయనపై ఎవరికీ పగ లేదు. కానీ ఆయన చేసే పనులు రాజ్యాంగానికి, చట్టానికి లోబడి ఉన్నాయా, లేదా అనేది చూసుకోవాలి. ఆయనేమీ పాలుతాగే పిల్లవాడు కాదు… 40 ఏళ్లు పైబడిన వ్యక్తి. ఎంత జాగ్రత్తగా ప్రవర్తించాలి.. ఎంత హుందాగా వ్యవహరించాలి.. అని ప్రశ్నించారు. సెలెబ్రిటీగా ఉన్న వ్యక్తి చట్టాల గురించి, తన పరిధి గురించి తెలుసుకోవాలి? తాను, దర్శకుడు సుకుమార్, మరొకరు కలిసి కొంత మొత్తం బాధిత కుటుంబానికి ఇవ్వాలనుకుంటున్నట్టు చెప్పారని, ఈ చర్య పరోక్షంగా బాధితులను ప్రలోభానికి గురిచేసినట్టే అవుతుందని ఏసీపీ స్పష్టం చేశారు.
నిన్న ఆయన కళ్లలో నాకు ఎలాంటి పశ్చాత్తాపం కనిపించలేదు. ఈ పదిహేను రోజుల నుంచి సక్సెస్ మీట్ లు పెట్టుకోలేకపోతున్నాననే బాధే కనిపించింది తప్ప, ఆయనలో ఎలాంటి విచారం లేదు. ఆయన తన ఇంటిని ఒక ఫంక్షన్ హాల్ లాగా మార్చేసి, వచ్చేవాళ్లు, పోయేవాళ్లతో చాలా హ్యాపీగా గడిపేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టం ఎప్పుడూ బాధితుల పక్షానే ఉంటుంది… మరి నువ్వు బాధితుడివా? ఏ రకంగా బాధితుడివి? బాగా పైసలు సంపాదించుకుని, లెక్కలు చూసుకుంటున్నావు… నీపై ఎవరైనా వ్యాఖ్యలు చేసినప్పుడు ప్రెస్ మీట్లు పెడుతున్నావంటూ ఏసీపీ విష్ణుమూర్తి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
కేసులో ముద్దాయిగా ఉన్న వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టవచ్చా అని ప్రశ్నించారు. ఈ విషయాలన్నీ కోర్టు కు తీసుకెళ్ళి బెయిల్ కాన్సల్ చెపించే అవకాశం కూడా ఉంది అని ACP అన్నారు. మేము ఒక్క పది నిమిషాలు తప్పుకుంటే ఎలా ఉంటుంది పరిస్థితి. అందరు పనులు చేసుకుంటే పోలీసు అధికారి రోడ్ల మీద ఉంటారు. సమాజం కోసం అతను అన్ని వేళలో అందుబాటులో ఉంటాడు. మేము కూడా మనుషులమే మమ్మల్ని అవమానించే విధంగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. అల్లు అర్జున్ వైఖరిపై, ఆయన నటించిన పుష్ప సినిమాలో ఎర్ర చందనం స్మగ్లింగ్ పై, పోలీస్ ఆఫీసర్ ను బట్టలూడదీసే సన్నివేశాలపై సైతం ఆయన సీరియస్ అయ్యారు.