పవిత్రం.. పుష్య మాసం..
-నేటి నుంచి పుష్యమాసం ప్రారంభం
-ఈ నెలంతా గిరిజనులకు పండుగలు... జాతరలే..
-పుష్యమాస అమావాస్య రోజున నాగోబా జాతర
-కారడివిలో, భక్తి శ్రద్ధలతో జంగూబాయి జాతర
-తొడసం వంశస్తుల ఖాందేవ్ పండుగ
-బుడుందేవ్, మహాదేవ్ జాతరకు ఈ నెలలోనే
-గిరిజన గూడేల్లో భక్తి శ్రద్ధలతో పండుగలు
The month of Pushya.. is sacred to the tribes: కొండా కోనల్లో జీవనం, అడవే జీవనాధారం. ఇక వారి వేషధారణ, పూజలు, పండుగలు, జాతరలు ఇలా ప్రతి అంశంలోనూ శైలి భిన్నంగా ఉంటుంది. వారి పండుగల గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఒక్కో పండుగ, ఒక్కో జాతర ఎంతో ప్రత్యేకం…
పుష్యమాసం వచ్చిందంటే చాలు ఆదివాసీలకు ఎంతో సంబురం. ఆనందంగా, ఉత్సాహంగా, భక్తి శ్రద్ధలతో వారి పండుగలు, ముఖ్యంగా జాతరలు ప్రారంభమవుతాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో దాదాపు అన్ని జిల్లాల్లో ఈ జాతరలు భక్తిశ్రద్ధల మధ్య కొనసాగుతాయి. ఆదివాసీ గ్రామాలు డోలు డప్పు వాయిద్యాలతో సందడి వాతావరణంతో.. ఆదివాసీలు నియమ నిష్టలతో ప్రత్యేక పూజలు చేస్తూ తమ ఆరాధ్య దైవాలను కొలుస్తుంటారు. ఆదివాసీలకు ప్రకృతికి విడదీయరాని బంధం ఉంది. వారి అలవాట్లు, ఆచారాలు ప్రకృతితోనే ముడిపడి ఉంటాయి.
ప్రతి నెలా ఒక్కో మాసంలో ఒక్కో పూజా కార్యక్రమం, వాటికి అనుగుణంగా ప్రత్యేక నియమ నిబంధనలు. ఆదివాసీలు వారి తెగల రూపంలో జీవిస్తున్న గోండుల ప్రత్యేకతలు అన్నీ ఇన్నీ కావు. వారి సంస్కృతి, సంప్రదాయాలు ఆశ్చర్యం కలిగించేవిగా ఉంటాయి. అదిలాబాద్ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పలు గిరిజన పండుగల సంబరాలు ప్రారంభమయ్యాయి. నేటి నుంచి పుష్యమాసం కావడంతో ఆదివాసీలు ఎంతో ఉత్సాహంగా తమ పండుగలు జరుకునేందుకు సిద్ధం అవుతున్నారు. ఆచారాలలో భాగంగా గోండ్, కొలం, తోటి మరియు పర్దాన్ లకు చెందిన ఆదివాసీలు మద్యపానానికి దూరంగా ఉంటారు.
నాగోబా జాతర..
నాగోబా జాతర ప్రపంచంలోని అతిపెద్ద గిరిజన జాతరల్లో ఒకటిగా విలసిల్లుతోంది. సర్ప జాతిని పూజించడమే ఆ పండగ ప్రత్యేకత. పుష్యమాసం అమావాస్య రోజు సాయంత్రం ఏడు గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల మధ్య కాలంలో గిరిజన పూజారులకు తను ఆరాధ్య దైవం ఆదిశేషు కనిపిస్తాడని, వారందించే పాలు తాగి ఆశీర్వదించి అదృశ్యమవుతాడని గిరిజనులు విశ్వసిస్తారు. అదిమ గిరిజనుల్లో మేస్రం వంశీయుల ఆరాధ్య దైవం నాగోబా గోండుల దేవుడు. పుష్య మాసంలో వచ్చే పౌర్ణమి రోజున మేస్రం వంశీయులు గోదావరి నది నుంచి తీసుకొచ్చిన జలంతో నాగోబా విగ్రహాన్ని శుభ్రపరుస్తారు. మూడు రోజుల పాటు అంగరంగ వైభంగా నాగోబా జాతర జరుగుతుంది.
కారడవిలో భక్తి శ్రద్ధలతో..
పచ్చని అడవిలో కొలువై ఉంటుందీ జంగూబాయి క్షేత్రం పుష్య సూసంలో ఆదివాసీలు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని కొలుస్తారు. దేవత అనగానే మనమంతా ఓ ఆకారం అని ఊహిస్తాం, కానీ ఇక్కడ ఓ గుహలో దీపం. వెలుగుతుంటుంది. ఆ దీపాన్నే రూపంగా ఊహించుకొని పూజలు చేస్తారు. గుహ లోపలికి వెళ్లాలంటే కొంచం కష్టపడి చెళ్లాల్సిందే. మన దగ్గర నుంచే కాకుండా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, తదితర రాష్ట్రాల నుంచి ఆదివాసీలు తరలివచ్చి తమ ఆదిదైవం జంగూబాయిని దర్శించుకుంటారు.
తైలం తాగే మహోత్సవం..
నార్నూర్ మండల కేంద్రంలో నిర్వహించే ఖాందేవ్ జాతర ఆద్యంతం అద్భుతమే. మాన్కాపూర్ లోని గోవర్ధన్ గుట్ట వద్ద ఆ వంశస్తులు కుటుంబసమేతంగా తొడసం వంశస్థులు బస చేస్తారు. మైసమాల్ దేవతకు సంప్రదాయ పూజలు నిర్వహిస్తారు. అక్కడి నుంచి ఖాందేవ్ ఆలయానికి చేరుకుంటారు. అర్ధరాత్రి తొడసం వంశీయులు దేవతల ప్రతిమలకు పవిత్రమైన గంగాజలంతో అభిషేకం చేస్తారు. సంస్కృతీ సంప్రదాయాల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించి జాతర ప్రారంభిస్తారు. ఆ వంశం అడబిడ్డ పవిత్రమైన నువ్వుల శైలం త్రాగుతుంది. తొడసం వంశీయుల సమక్షంలో మట్టి పాత్రలో 2.5 కిలోల నువ్వుల నూనెను ఆమె తాగుతుంది. ఖాందేవ్ మహా పూజ కోసం తొడసం వంశంలోని ప్రతి ఇంటి నుంచి నువ్వుల నూనెను తీసుకొస్తారు. ఆ నూనెను మట్టి పాత్రలో సేకరించి తొడసం అడపడుచు సేవించడం ఇక్కడి. ఆదివాసీలు అనాదిగా పాటిస్తున్న ఆచారం. తమ కుటుంబాలను, పాడి పంటలను ఖాందేవ్ దేవుడు చల్లగా చూడాలని కోరుకుంటూ నూనె మొక్కును చెల్లిస్తారు.
బుడుందేవ్, మహాదేవ్ జాతర
నాగోబా జాతర ముగిసిన తర్వాత ఉట్నూర్ మండలం శ్యాంపూర్లో బుడుందేవ్ జాతరను మెస్రం వంశీయులు ప్రారంభిస్తారు. శ్యాంపూర్లో బుడుందేవ్ జాతర ముగిసిన తర్వాత సిర్పూర్(యు) మండల కేంద్రంలో మహాదేవ్ జాతరను ప్రారంభిస్తారు. అగ్రం వంశీయులు ప్రత్యేక పూజలతో మహాదేవ్ ను కొలుస్తారు. అదిలాబాద్ జిల్లా బేల మండలంలోని సదల్దూర్లో బైరందేశ్, మహాదేవ్ ఆలయాల్లో సదల్ పూర్ జాతర నిర్వహిస్తారు. మనసులో ఏదైనా కోరుకొని బైరందేవ్ ఆలయంలో ఉన్న శివ లింగాన్ని పైకి ఎత్తాలి. కోరిక నెరవేరేదైతే శివలింగం సుష్ఠుగా పైకి లేస్తుందని భక్తుల నమ్మకం. లేదంటే ఏటూ కదలకుండా ఉంటుంది. ప్రతి ఏటా పుష్పమాసంలో ఇక్కడ జాతర నిర్వహిస్తారు. అటవీ ప్రాంతంలో నిర్వహిస్తుండటంతో జాతరను జంగి జాతరగా పిలుస్తుంటారు. ఈ ఆలయాల్లో కేవలం కోరంగీ వంశీయులతోనే పూజలు ప్రారంభిస్తారు. వారం రోజుల పాటు జాతర కొనసాగిన తర్వాత అమవాస్య రోజున కాలదహి హండి’ కార్యక్రమం నిర్వహించి జాతర ముగిస్తారు.