తాగి విద్యుత్ తీగలపై పడుకున్నాడు
Drunk and slept on electric wires: తాగితే ఏం చేస్తున్నారో కొందరికి అసలు తెలియదు… తాగడం నానా రచ్చ చేయడం వారికి పరిపాటే… ఈ మందు బాబు అలాగే చేశాడు… అలా… ఇలా కాదు.. దేశం మొత్తం వైరల్ అయ్యేలా చేశాడు మరి..
కొత్త సంవత్సరం మందు తాగి, మద్యం మత్తులో ఓ వ్యక్తి ఏకంగా విద్యుత్ తీగలపై పడుకుని మరీ విన్యాసాలు చేశాడు. ఆంధ్రప్రదేశ్‌లోని మన్యం జిల్లా పాలకొండ మండలం ఎం.సింగిపురంలో ఓ మందుబాబు మద్యం మత్తులో విద్యుత్ స్తంభం ఎక్కేందుకు ప్రయత్నించాడు. దీనిని చూసిన కొందరు వ్యక్తులు అతన్ని ఆపేందుకు ప్రయత్నించారు. కానీ అతను పై దాకా వెళ్లాడు. ఎవరు ఎన్ని కేకలు వేస్తున్నా పట్టించుకోలేదు. దాంతో.. కరెంటు తీగలు ముట్టుకుంటాడేమో అని వెంటనే ట్రాన్స్‌ఫార్మర్ ఆపేశారు.
అతను ఆగకుండా పైకి వెళ్లి ఏకంగా విద్యుత్ తీగలపై హాయిగా పడుకున్నాడు. కాసేపు మేఘాల్లో తేలుతున్నట్లు అటూ ఇటూ ఊగాడు. అక్కడి నుంచి కింద పడతాడేమో అని అంతా టెన్షన్ పడ్డారు. అతన్ని కిందకు దిగమని కేకలు పెట్టారు. ఎవరు ఎంత అరిచినా అతను అలాగే ఉండిపోయాడు. చివరకు కొందరు అతన్ని బతిమలాడి కిందికు దించారు. ముందు జాగ్రత్తగా విద్యుత్ సరఫరా ఆపకపోయినా, అతనికి నచ్చజెప్పి తీగలపై నుంచి కింద పడకుండా తీసుకురాకపోయినా అతని ప్రాణాలు పోయేవి… మొత్తానికి కిందకు తెచ్చారు. ఈ మొత్తం ప్రాసెస్‌లో ఏ చిన్న తేడా వచ్చినా.. అతని ప్రాణాలకే ప్రమాదం అయ్యేది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.