వాహనాల వేగానికి స్పీడ్‌ గన్స్‌తో కళ్లెం..

-ప్రమాదాల నివారణకు పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో చర్యలు
-2024లో స్పీడ్ గన్ తో 7047 కేసులు నమోదు
-వాటి జరిమానా విలువ రూ. 72.77 లక్షలు

రోడ్డు ప్రమాదాల నివారణ కు పోలీస్‌శాఖ ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తోంది. జాతీయ‌, రాష్ట్ర రహదారులపై నిర్ణీత వేగానికి మించి వెళ్లే వాహనాలపై చర్య లు తీసుకుంటున్నారు. ప్రధానంగా జాతీయ రహదారులపై ప్రతి రోజూ నిఘా ఉంచుతూ అధిక వేగంతో వెళ్లే వాహనాలపై కేసు నమోదు చేయడంతో పాటు జరిమానా విధిస్తున్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప‌లు చోట్ల స్పీడ్‌గన్స్‌ ఏర్పాటు చేశారు. దీంతో రోడ్డు ప్రమాదాలు తగ్గుముఖం పట్టాయి. వేగంగా వెళ్లే వాహనాలకు కళ్లెం వేశారు. రామగుండము పోలీస్ కమిషనరేట్ పరిధి పెద్దపల్లి, మంచిర్యాల జోన్ పరిధిలో ప్రమాదాల నివారణకు జాతీయ, రాష్ట్ర రహదారులపై నిర్ణీత వేగానికి మించి వెళ్లే వాహనాలపై చర్యలు తీసుకుంటున్నారు . జిల్లాలోని ఏయే ప్రాంతాల్లో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతాయనేది గుర్తించారు. దీంతో అధికారులు ఆయా ప్రాంతాల్లో స్పీడ్‌ గన్‌ యంత్రాలను ఏర్పాటు చేసి నిర్ణీత వేగానికి మించి వాహనాలు వెళితే జరిమానాలు విధిస్తున్నారు. ఈ యంత్రాలు ఏర్పాటు చేసిన తర్వాత వేగంగా వెళ్లే వాహనాలకు చెక్‌ పెట్టడంతో పాటు తరచూ జరిగే రోడ్డు ప్రమాదాల నివారణకు అధికారులు తీసుకున్న చర్యలు విజయవంతం అయ్యాయి.

అతివేగంతో.. తరచూ రోడ్డు ప్రమాదాలు
రాజీవ్‌ర‌హ‌దారితో పాటు జాతీయ ర‌హ‌దారిపై నిత్యం ఏదో ఒక ప్రమాదం జరుగుతూనే ఉంటుంది. అతివేగంతోనే తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతూ, చాలా మంది మృత్యువాత పడిన ఘటనలు ఉన్నాయి. రోడ్డు ప్రమాదాలను పూర్తిగా తగ్గించడంతోపాటు వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు స్పీడ్ గన్స్ ఏర్పాటు చేశారు. వేగంగా వెళ్లే వాహనాదారుల నుంచి రూ.1035 జరిమానా వసూలు చేస్తున్నారు. అధిక వేగంతో వెళ్లే వాహనాల ఫొటోలు తీసి సంబంధిత వాహనదారుడి మొబైల్‌ నంబర్‌కు మెస్సేజ్‌ రూపంలో పంపిస్తున్నారు. సంబంధిత మెస్సేజ్‌లో వాహనం వెళ్లిన స్పీడ్‌, తేదీ, సమయం, ఎంత దూరం నుంచి ఫొటో తీసిందో, స్పీడ్‌ లిమిట్‌, వెహికల్‌ లైసెన్స్‌, నంబర్‌ ప్లేట్‌ వివరాలతో కూడిన జరిమానా వివరాలను వాహనదారులకు నేరుగా ఇంటికి పంపిస్తున్నారు. ఈ యంత్రాలతో పగటి పూటతో పాటు రాత్రి సమయాల్లోనూ వేగంగా వెళ్లే వాహనాలకు చెక్ పెట్టారు.

7,047 కేసులు నమోదు
రామగుండము కమిషనరేట్ లో మూడు స్పీడ్‌ గన్‌ కెమెరాలు ఏర్పాటు చేశారు. గత ఏడాది రామగుండం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2,460 కేసులు, జరిమానా రూ.25.46 ల‌క్ష‌లు పెద్దపల్లి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిదిలో 1505 కేసులు, జరిమానా రూ.15.57 ల‌క్ష‌లు, మంచిర్యాల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో 3082 కేసులు, వాటి జరిమానా రూ. 31.73 ల‌క్ష‌లు జ‌రిమానా విధించారు. క‌మిష‌న‌రేట్ ప‌రిధిలో మొత్తం 7047 కేసులు, రూ. 72.77 లక్షల జరిమానా విధించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో కమిషనరేట్ వ్యాప్తంగా నిత్యం ప్రమాదాలు జరిగే 53 ప్రాంతాలను బ్లాక్‌ స్పాట్లుగా గుర్తించారు. బ్లాక్‌ స్పాట్ల వద్ద ప్రమాదాలు జరగకుండా పోలీస్ వారి ఆధ్వర్యంలో సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు.

రోడ్డు ప్ర‌మాదాల నివార‌ణ‌కు ప్ర‌త్యేక కృషి – రామ‌గుండం క‌మిష‌న‌ర్ ఎం.శ్రీ‌నివాస్
రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీస్ ఆధ్వర్యంలో కృషి చేస్తున్నాం. నిర్ణీత వేగానికి మించి వెళ్లే వాహనాలపై చర్యలు తీసుకుంటున్నాం. ప్రధానంగా జాతీయ రహదారులపై ప్రతి రోజూ నిఘా ఉంచుతూ అధిక వేగంతో వెళ్లే వాహనాలపై కేసు నమోదు చేయడంతో పాటు జరిమానా విధిస్తున్నాం. వాహనదారులు డ్రైవింగ్‌ చేసే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వాహనాలు నిర్దేశించిన వేగంతోనే వెళ్లాలి. అధిక వేగంతో వెళ్లి ప్రమాదాలు జరిగితే కుంటుబాలు ఇబ్బందులకు గురవుతాయి. అందుకే అంద‌రూ ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ గమ్య స్థానాలకు చేరుకోవాలి.

Get real time updates directly on you device, subscribe now.

You might also like