ఆదిలాబాద్‌ను వ‌ణికిస్తున్న చ‌లిపులి

Low temperatures: ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాను చలి వణికిస్తున్నది. గడిచిన నాలుగైదు రోజుల్లో రాష్ట్రంలోనే అతితక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మధ్యాహ్నం సైతం వాతావరణం చల్లగానే ఉంటోంది. సాయంత్రం 6 గంటలయ్యిందంటే చాలు జనాలు బయటికి రావడం లేదు. ఉదయం 8 గంటల దాటాక కూడా వాతావరణం పొగమంచుతో కప్పి ఉంటోంది. నిత్యం జన సంచారం, వాహనాల రాకపోకలతో రద్దీగా కనిపించే రోడ్లు చీకటి పడిందంటే చాలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి.

రాష్ట్రంలోనే అత్యల్పంగా ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాలో ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదు అయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా అర్లీ (టి) లో 5.9 డిగ్రీలు, కొమురం భీం జిల్లా సిర్పూర్ (యూ) లో 6 డిగ్రీలు, నిర్మల్ జిల్లా పెంబిలో 8 డిగ్రీలు, మంచిర్యాల జిల్లా నెన్నల లో 9.5 గా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోద‌య్యాయి. త‌క్కువ ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదు అవుతున్న జిల్లాల వారీగా చూసుకుంటే రాష్ట్రంలోని టాప్‌ 15 జిల్లాల్లో నాలుగు జిల్లాలు ఉమ్మడి ఆదిలాబాద్‌ నుంచే ఉన్నాయంటే ఇక్కడ చలి తీవ్రత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

మ‌రో నాలుగైదు రోజులు ఉమ్మడి జిల్లా లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఒక్కసారిగా వాతావరణంలో వచ్చిన మార్పుల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. అత్యవసరమైతేగానీ బయటికి రాకూడదని, తెల్లవారుజూమున, రాత్రి వేళ బయటికి వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like