భారత్‌లోకి కొత్త వైరస్ ఎంట్రీ
HMPV Virus: చైనాలో మరో కొత్త వైరస్ పుట్టుకొచ్చిన విషయం తెలిసిందే. ఆ వైరస్ ప్రభావంతో చైనాలో పెద్ద ఎత్తున జనాలు ఆసుపత్రుల్లో చేరుతున్నారు. హెచ్ఎంపీవీ పేరుతో పిలిచే ఈ వైరస్ బారిన పడటంతో ఇప్పటికే యాక్టివ్ కేసులు పెరుగుతూ చైనా ప్రజల్ని భయాందోళనకు గురి చేస్తోంది. ఈ వైరస్ బారిన పడి పెద్ద సంఖ్యలో ఆస్పత్రుల ముందు క్యూ కట్టిన రోగుల ఫొటోలు వైరల్ అయ్యాయి. ఇప్పటివరకూ చైనాలోనే ఎక్కువగా కనిపించిన హెచ్‌ఎంపీవీ వైరస్ కేసులు ఇప్పుడు మలేషియాలోనూ విపరీతంగా పెరిగిపోతున్నాయి. అయితే ఈ వైరస్ మన దేశంలోకి కూడా ప్రవేశించింది. దీనికి సంబంధించిన తొలి కేసు నమోదయ్యింది. బెంగళూరు ఆసుపత్రిలో ఓ శిశువులో HMPV వైరస్ కనుగొన్నారు. నగరంలో ఇదే మొదటి కేసు కావడంతో వైద్య, ఆరోగ్య సిబ్బంది, అధికారులు అప్రమత్తం అయ్యారు. చిన్నారికి హెచ్ఎంపీవీ వైరస్ పాజిటివ్ లక్షణాలు ఉన్నట్లుగా తొలి కేసు నమోదైనట్లుగా కర్నాటక వైద్య, ఆరోగ్యశాఖ ప్రకటించింది.
HMPV అనేది శ్వాసకోశ వ్యాధులు కలిగించే ఒక రకమైన వైరస్. ఇది పిల్లలు, వృద్ధులు, బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్న వ్యక్తులను వేగంగా ప్రభావితం చేస్తుంది. దీని లక్షణాలు సాధారణంగా ఫ్లూ లాగా ఉంటాయి. ఈ వైరస్ సోకినవారిలో జ్వరం, గొంతు నొప్పి, దగ్గు ఉంటుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడతారు. HMPV వైరస్ తీవ్రమైతే న్యుమోనియా, బ్రాంకైటిస్ వచ్చేందుకు అవకాశముంది. HMPV లక్షణాలను వెంటనే గుర్తించకపోతే ప్రమాదకరంగా మారే అవకాశముందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిరంతర జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అలసట, బలహీనత వంటి లక్షణాలుంటే నిర్లక్ష్యం చేయవద్దని కోరుతున్నారు.