ద‌ళారుల కొమ్ము కాస్తున్నారంటూ రైతుల ఆందోళ‌న‌

సీసీఐ అధికారులు.. జిన్నింగ్ మిల్ యజమానులు కుమ్మ‌క్కై ప‌త్తి రైతుల‌ను నానా ఇబ్బందుల‌కు గురి చేస్తున్నారు. ప‌ర్య‌వేక్షించాల్సిన అధికారులు క‌నీసం అటు వైపుగా క‌న్నెత్తి చూడ‌క‌పోవ‌డంతో రైతుల ప‌రిస్థితి అగ‌మ్య‌గోచ‌రంగా త‌యార‌య్యింది. తాండూరు మండలం రేపల్లివాడ పత్తి మిల్లు వద్ద ప‌త్తి రైతుల‌ను ప‌ట్టించుకోకుండా వ్యాపారుల‌కే పెద్ద పీట వేస్తున్నారు. త‌మ‌ను క‌నీసం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని, వ్యాపారుల‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీసీఐ ద్వారా మద్దతు ధర వస్తుందని ఇక్క‌డ‌కు వ‌స్తే దళారులతో కుమ్మకై తమ వాహనాలను మూడు రోజులుగా ప‌క్క‌న పెట్టేశార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. త‌మ వాహ‌నాల‌ను ప‌క్క‌న పెట్టేసి దళారుల వాహనాలను ముందు పంపిస్తున్నార‌ని తెలిపారు. ఒక్కొక్కరికి రోజు రెండు ట్రిప్పుల అవకాశం ఇస్తున్నట్లు రైతులు చెప్పారు. రెండో శనివారం, ఆదివారం పండగ ఇలా నాలుగు రోజులు సెలవు వస్తుందని బాధతో ఏం చేయాలో దిక్కు తోచని స్థితిలో ఉన్నామ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులకు చెబుదామంటే ఎవరు అందుబాటులో లేర‌ని, క‌నీసం ఫోన్ కాల్స్ కూడా లేపడం లేదని చెప్పారు. జిన్నింగ్ మిల్లు యజమానిని నిలదీస్తే మా ఇష్టం వ‌చ్చిన వారి వాహ‌నాలు ముందు అనుమ‌తిస్తామ‌ని, అవి అయ్యాకే వేరే వారిని లోపల పంపిస్తామన్నట్లు నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారని వాపోయారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like