వైభవంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు

Mukkoti Ekadasi: రాష్ట్ర వ్యాప్తంగా వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఉత్తర ద్వారం గుండా విష్ణుమూర్తిని దర్శించుకునేందుకు శుక్రవారం తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాల దగ్గర బారులు తీరారు. పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పిస్తున్నారు. ఈ రోజును విష్ణువును దర్శించుకుంటే వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని భక్తుల నమ్మకం. యాదగురిగుట్టలో ఉదయం నుంచే యాదాద్రీశుడి దర్శనానికి అనుమతినిస్తున్నారు. గరుడ వాహనంపై వాసుదేవుడి రూపంలో స్వామివారి ఉత్తర ద్వార దర్శనం కల్పిస్తున్నారు. భద్రాచలంలోనూ వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్తర ద్వారా దర్శనం ద్వారా భక్తులకు సీతారామస్వామి దర్శనమిస్తున్నారు. గరుడ వాహనంపై శ్రీరామ చంద్రుడు, గజ వాహనంపై సీతమ్మ దర్శనమిస్తున్నారు. స్వామి దర్శనానికి భారీగా భక్తులు తరలివస్తుండటంతో ఆలయ అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే వేములవాడ రాజరాజేశ్వరస్వామి, ధర్మపురి, భద్రకాళి, దేవాలయాలకు భక్తులు పోటెత్తారు. వైకుంఠ ద్వారం గుండా దర్శనమిస్తున్న స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలి వచ్చారు.