ప్రాణం తీసిన ఈత సరదా.. ఐదుగురి మృత్యువాత
Kondapochamma Sagar Dam : స్నేహితులంతా కలిసి సంక్రాంతి సెలవులు కావడంతో ఎంజాయ్ చేద్దామని భావించారు. సిద్దిపేట జిల్లా (Siddepet district) కొండపోచమ్మ సాగర్ డ్యామ్ వద్ద గడుపుదామని వెళ్లారు. ఏడుగురు యువకులు తమ తల్లిదండ్రులకు చెప్పి వెళ్లారు. కానీ, వారికి అదే చివరి చూపు అయ్యింది. ఈత కోసం డ్యాంలోకి దిగిన వారిలో ఒకరి ఒకరి తర్వాత ఒకరు డ్యాంలో పడి గల్లంతయ్యారు. వీరు మునిగిపోతున్నట్లు గుర్తించిన గత ఈతగాళ్లు రంగంలోకి దిగినా, అప్పటికే జరగాల్సి నష్టం జరిగింది. ఏడుగురిలో ఐదుగురు యువకులు మృత్యువాత పడ్డారు.
సిద్దిపేట జిల్లాలోని మార్కుర్ మండలం కొండపోచమ్మ సాగర్ డ్యాంలో పడి ఐదుగురు యువకులు మృతి చెందారు. మృతులు హైదరాబాద్ ముషీరాబాద్ ప్రాంతానికి చెందిన వారు. ముందుగా యువకులు గల్లంతయ్యారన్న విషయం తెలిసిన వెంటనే వారి కోసం గజ ఈతగాళ్లు గాలింపు చర్యలు చేపట్టారు. మొత్తం ఏడుగురు యువకుడు డ్యాంలో పడిపోగా.. వారిలో ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. మిగిలిన ఐదుగురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. వారి మృతదేహాలను గజ ఈతగాళ్లు ఒడ్డుకు చేర్చారు. మృతులు ధనుష్ (20), లోహిత్ (17), చీకట్ల దినేశ్వెర్ (17), సాహిల్ (19), జతిన్ (17)గా గుర్తించారు. అలాగే కొమరి మృగంక్ (17), ఎండీ ఇబ్రహీం(20) సురక్షితంగా బయటపడ్డారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సరదాకు ఈతకు వెళ్లిన తమ బిడ్డలు విగతజీవులుగా మారడంతో తల్లిదండ్రుల శోకం వర్ణణాతీతంగా మారింది.