బీఆర్ఎస్ కార్యాలయంపై కాంగ్రెస్ నేతల దాడి
Congress leaders attacked BRS office: భువనగిరి బీఆర్ఎస్ కార్యాలయంపై కాంగ్రెస్ నాయకుల దాడి చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఆందోళన చేశారు. బీఆర్ఎస్ ఆఫీస్‌లోని ఫర్నీచర్, అద్దాలు ధ్వంసం చేశారు. బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణా రెడ్డి శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్‌ఎస్‌యూ నాయకులు గుంపుగా వచ్చి పార్టీ కార్యాలయంపై దాడి చేశారు. ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. బీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలపై సైతం దాడికి యత్నించారు. అనంతరం కార్యాలయం ముందు బైఠాయించి నిరసన తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి పరిస్థితిని అదుపు చేశారు.
సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ భువనగిరి జిల్లా అధ్యక్షుడు కంచెల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని.. క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రిపై అలాంటి వ్యాఖ్యలు తగవని నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కార్యకర్తల దాడిని బీఆర్‌ఎస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. రేవంత్ చేతగాని పాలనపై విమర్శలను తట్టుకోలేకనే కాంగ్రెస్ నాయకులు దాడికి తెగబడ్డారని తెలిపింది. పాలన చేతగాక, మీ అసమర్థతపై ప్రశ్నిస్తే దాడులకు తెగబడతారా అని మండిపడింది. కొద్ది రోజుల కిందట బీజేపీ కార్యాయలంపై సైతం కాంగ్రెస్ శ్రేణులు దాడికి పాల్పడ్డ విషయం తెలిసిందే. బీజేపీ నేత ప్రియాంక గాంధీ పై వివాదస్పద వ్యాఖ్యలు చేశారని నిరసన తెలిపి.. బీజేపీ కార్యాలయంలో రాళ్లతో దాడి చేశారు. దీనిని పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్ ఖండించారు కూడా. పార్టీ కార్యాలయాలపై దాడులు సరికావని ఆయన పార్టీ శ్రేణులకు హితవు పలికారు. అయినా ఈ రోజు మళ్లీ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై దాడులకు పాల్పడటం గమనార్హం.