17 మంది మావోయిస్టుల మృతి

17 Naxals Killed in Basthar Encounter: ఛత్తీస్‌గఢ్‌లో మరో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. దక్షిణ బస్తర్ ప్రాంతంలో గురువారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో 17మంది నక్సలైట్లు ప్రాణాలు కోల్పోయారు. బీజాపూర్ జిల్లా ఉసూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పూజారీ కాంకేర్, మారేడుబాక ప్రాంత అడవుల్లో పోలీసుల కూంబింగ్ నేపథ్యంలో మావోయిస్టులు తారసపడ్డారు. ఈ నేపథ్యంలో ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. మూడు జిల్లాలకు చెందిన డిస్ట్రిక్ గార్డ్స్, సీఆర్‌పీఎఫ్, కోబ్రా దళాలు చుట్టుముట్టడంతో ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. మొదటగా నలుగురు మావోయిస్టులు మృతి చెందారని ప్రకటించగా, ఆ సంఖ్య పెరుగుతూ పోయింది. చివరకు 17 మంది మావోయిస్టులు మరణించినట్లు పోలీసులు ప్రకటించారు.
ఈ మధ్య ప్రతిరోజూ పోలీసులు ఎన్‌కౌంటర్‌లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే అనేక మంది మావోలు ప్రాణాలు కోల్పోతున్నారు. నాలుగు రోజుల క్రితమే బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మహిళా నక్సలైట్లు సహా ఐదుగురు మావోలు ప్రాణాలు కోల్పోగా.. ఈ రోజు మళ్లీ జరిగిన ఎన్‌కౌంటర్‌లో మొత్తం 17 మంది మావోయిస్టులు హతం అయ్యారు. ఈ ఘటన జరగడానికి కొన్ని గంటల ముందే బీజాపూర్ జిల్లాలో నక్సల్స్ ఐఈడీ బాంబు పేల్చారు. జవాన్లే లక్ష్యంగా జరిగిన ఈ ఐఈడీ పేలుడులో ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు.