మూడు రోజుల్లో రూ. 400 కోట్ల మ‌ద్యం తాగారు

Sankranti Liquor sales record : సంక్రాంతి పండగ మూడు రోజులు ఆంధ్రప్ర‌దేశ్‌లో రికార్డు స్థాయిలో మ‌ద్యం అమ్మ‌కాలు సాగాయి. కేవలం మూడు రోజుల్లోనే రాష్ట్రవ్యాప్తంగా దాదాపు రూ. 400 కోట్ల విలువైన మద్యం తాగేశారు. భోగి రోజు రూ.100 కోట్ల మద్యం అమ్మకాలు జరగ్గా.. సంక్రాంతి, కనుమ రోజుల్లో అయితే రోజుకు రూ. 150 కోట్ల చొప్పున మద్యం విక్రయాలు జరిగాయి. సంక్రాంతి సరుకు అయిపోవడంతో మద్యం షాపుల యజమానులు భారీగా సరుకు కొనుగోలు చేయడంతో ఈ గణాంకాలు బయటకు వచ్చాయి. సాధారణంగా ఆంధ్రప్రదేశ్‌లో రోజుకు రూ. 80 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరుగుతుంటాయి. పండగ మూడు రోజుల్లో ఇందుకు అదనంగా రూ.160 కోట్ల మద్యం అమ్ముడైంది. భోగిరోజున మద్యం లైసెన్స్‌దారులు రూ.210 కోట్లు, గురువారం రూ. 220 కోట్ల మద్యం కొనుగోలు చేశారు.

జనవరి 10 నుంచి 15వ తేదీ వరకు చూస్తే 6,99,464 కేసుల లిక్కర్‌, 2,29,878 కేసుల బీరు అమ్ముడైంది. ఈ ఆరు రోజుల్లో లిక్కర్‌ అమ్మకాలు సగటు కంటే లక్ష కేసులు, బీరు దాదాపు 30 వేలకుపైగా అమ్ముడైనట్లు అధికారులు తెలిపారు. గతంలో ఎన్నడూలేని విధంగా ఈసారి సంక్రాంతికి రికార్డు స్థాయిలో అమ్మకాలు జరిగాయని ఎక్సైజ్‌ వర్గాలు చెబుతున్నాయి. ఈసారి కోడి పందేల బరులు పెరగడం కూడా మద్యం అమ్మకాలపై ప్రభావం చూపింది. ఇతర రాష్ట్రాల‌ నుంచి నాన్‌ డ్యూటీ పెయిడ్‌ లిక్కర్‌ రాకుండా ఎక్సైజ్‌ శాఖ పటిష్ట చర్యలు తీసుకుంది. దీంతో మద్యం అమ్మకాలు పెరిగాయని అధికారులు చెబుతున్నారు.

సాధారణంగా జ‌న‌వ‌రి 1 నూతన సంవత్సరం సంద‌ర్భంగా అధికంగా మద్యం అమ్మకాలు జరుగుతుంటాయి. డిసెంబరు 31న ఒక్కరోజే రాష్ట్రంలో రూ.200 కోట్ల మద్యం తాగేశారు. 2.5 లక్షల కేసుల లిక్కర్‌, 70 వేల కేసుల బీరు ఒక్కరోజే అమ్ముడైంది. అయితే న్యూ ఇయర్ స్థాయిలో గతంలో ఎన్నడూలేని విధంగా సంక్రాంతి పండక్కి కూడా మద్యం అమ్మకాలు రికార్డు స్థాయిలో పెరిగాయి. మూడు రోజుల్లో సగటున రోజుకు రూ.133 కోట్ల విక్రమాలు జరిగాయంటే అర్ధం చేసుకోవచ్చు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక క్వార్టర్‌ రూ. 99కే అందుబాటులోకి రావడంతో లిక్కర్‌లో 23శాతం, బీరులో 38శాతం అమ్మకాలు పెరిగాయి. దీంతో పండగ మూడు రోజుల్లో ప్రభుత్వ ఖజానాకి దండిగా ఆదాయం పెరిగింది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like