సైఫ్ అలీఖాన్ కేసులో నిందితుడు బంగ్లాదేశీ

Mumbai Police : బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ పై దాడి సినీ పరిశ్రమను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. అతడిపై ఓ దుండగుడు కత్తితో అమానుషంగా దాడి చేయడం సంచలనంగా మారింది. సైఫ్ అలీ ఖాన్ ప్రస్తుతం ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ కేసులో నిందితుడి కోసం తీవ్రంగా గాలించిన బాంద్రా పోలీసులు ఎట్టకేలకు అతడ్ని పట్టుకున్నారు. విలేకరుల సమావేశం పెట్టి నిందితుడికి సంబంధించిన పలు అంశాలను వెల్లడించారు. సైఫ్ మీద దాడి చేసిన వ్యక్తి పేరు మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్ అని తెలిపారు. అతడ్ని అరెస్ట్ చేశామని వెల్లడించారు.
సైఫ్ మీద దాడి చేసిన నిందితుడు మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్ ఇక్కడి వాడు కాదని అతడు బంగ్లాదేశ్ వాసి అని పోలీసులు తెలిపారు. అతడి వయసు 30 సంవత్సరాలు. ఆరు నెలలుగా ముంబైలో ఉంటున్నాడు. ‘షరీఫుల్ ఇస్లాం భారత్‌లోకి అక్రమంగా చొరబడ్డాడు. అందుకే పేరు మార్చుకున్నాడు. విజయ్ దాస్ అనే పేరుతో ఇక్కడ చలామణి అవుతున్నాడు. హౌజ్ కీపింగ్ ఏజెన్సీలో పని చేస్తున్నాడు. సైఫ్ ఇంటికి దొంగతనం కోసం వెళ్లాడు. అతడ్ని త్వరలో కోర్టులో ప్రవేశపెడతాం’ అని ముంబై డీసీపీ స్పష్టం చేశారు.