తిరుమల శ్రీవారికి భారీగా ఆదాయం..ఎంతంటే..

Tirumala Thirupathi Devashtanam : వైకుంఠ ద్వార దర్శనాల సందర్భంగా పది రోజుల్లో స్వామి వారి హుండీకి భారీగా ఆదాయం వచ్చింది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగించారు. తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలు పూర్తయ్యాయి. ఆదివారం రాత్రి ఏకాంత సేవతో వైకుంఠ ద్వారాలు మూతపడ్డాయి. ఈ పది రోజుల్లో 6 లక్షల 83 వేల 304 మంది వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. 2023-24లో 6 లక్షల 47 వేల మంది , 2022-23లో 3 లక్షల 78 వేల మంది, 2021-20 లో 4 లక్షల మంది భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. ఇలా ప్రతి ఏటా వైకుంఠ ద్వార దర్శనాలు చేసుకునే భక్తుల సంఖ్య పెరుగుతూనే ఉంది.
ఇక ఈ పది రోజుల్లో శ్రీవారి హుండీకి రూ. 34.43 కోట్లు ఆదాయం వచ్చింది. అలాగే లక్షా 83 వేల 132 మంది భక్తుల శ్రీవారికి తలనీలాలు అర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు ముగిసిన నేపథ్యంలో నేటి నుంచి సర్వ దర్శనానికి అనుమతి ఇస్తున్నారు. ఇవాళ్టి నుంచి ఎలాంటి టోకెన్లు లేకుండా భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తున్నట్లు టీటీడీ పేర్కొంది. ప్రోటోకాల్ మినహా సిఫార్సు లేఖలపై వీఐపీ బ్రేక్ దర్శనం, ఆఫ్‌లైన్‌లో శ్రీవాణి ట్రస్ట్ టికెట్ల జారీ రద్దు చేసింది.