ఫోన్ గిఫ్ట్ ఇచ్చి… కోట్లు కొట్టేశారు..

Cyber ​​fraud : అంద‌మైన ఫోన్ గిఫ్ట్‌గా వ‌చ్చింద‌నుకున్నాడు.. తెగ సంబుర‌ప‌డిపోయాడు. త‌న సిమ్ తీసి కొత్త ఫోన్‌లో వేసుకున్నాడు. కొన్ని గంట‌ల్లోనే బ్యాంకు ఖాతాలో ఉన్న రూ. 2.80 కోట్లు పోగొట్టుకున్నాడు. అంత పెద్ద మొత్తంలో డబ్బులు ఎలా పోగొట్టుకున్నాడు.. ఇంత‌కీ ఏమైందంటే..

బెంగళూరుకు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఇటీవలే ఓ సిమ్‌కార్డు కొనుగోలు చేశాడు. అత‌నికి ఓ అపరిచిత వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. ఎదుటి వ్య‌క్తి అత‌నికి ఓ మంచి శుభవార్త చెప్పాడు. కొత్తగా సిమ్‌కార్డు కొనుగోలు చేసిన వారందరి పేరిట లాటరీలు తీశామని, అందులో మీరు గెలుపొందారని శుభాకాంక్ష‌లు చెప్పాడు. గెలిచిన వాళ్ల‌కి ఓ రెడ్‌మీ ఫోన్‌ను గిఫ్టుగా ఇస్తున్నట్లు వివరించాడు. వెంటనే తన అడ్రస్‌ను ఆ వ్యక్తికి ఇచ్చిన సాఫ్ట్‌వేర్ ఇంజ‌నీర్ ఆనందం వ్య‌క్తం చేశాడు. వారం రోజుల త‌ర్వాత ఆ ఫోన్ తన ఇంటికి రానే వ‌చ్చింది.

వెంటనే తన పాత ఫోన్‌లో ఉన్న సిమ్‌కార్డు తీసేసి.. కొత్త ఫోన్‌లో వేశాడు. ఆపై పలు యాప్స్‌ను ఇన్‌స్టాల్ చేసుకున్నాడు. గంట తర్వాత ఆ ఫోన్‌కు అనేక మెసేజ్ లు, ఓటీపీలు వచ్చాయి. అయితే కొత్త ఫోన్‌లో యాప్స్ ఇన్‌స్టాల్ చేస్తున్నప్పుడు ఇదంతా జరగడం సహజమే అనుకున్న అతడు వాటిని చదవకుండానే వదిలేశాడు. కానీ తన ఖాతాలో ఉన్న రూ.2.80 కోట్లు మాయమవడంతో షాకై వెంటనే బ్యాంకుకు వెళ్లాడు. ఆరా తీయగా.. మీరే ఎవరికో ఆ డబ్బులను ట్రాన్స్‌ఫర్ చేశారంటూ బ్యాంకులోని ఉద్యోగులు చెప్పారు. అప్పుడు తాను మోసపోయినట్లు గుర్తించిన టెకీ.. వెంట‌నే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా.. సైబర్ నేరగాళ్లే అతడికి ఓ ఫోన్ పంపించారని గుర్తించారు. ఆ ఫోన్‌లో ముందుగా ఇన్‌స్టాల్ చేసిన కొన్ని యాప్స్‌తోనే టెకీకి సంబంధించిన ఓటీపీలు, పాస్‌వర్డులను గుర్తించి అతడి ఖాతాలో ఉన్న 2 కోట్ల 80 లక్షల రూపాయలను కొట్టేసినట్లు తెలుసుకున్నారు. ప్రస్తుతం నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు తీవ్ర ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చిన ఎలాంటి బహుమతులను ఉపయోగించకూడదని వారు చెప్పినట్లు చేసి డబ్బులు పోగొట్టుకోవ‌ద్ద‌ని హెచ్చరిస్తున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like