మ‌ద్యం ప్రియుల‌కు శుభ‌వార్త‌

Kingfisher Beers Supply: తెలంగాణలోని మద్యంప్రియులకు శుభవార్త. కింగ్ ఫిషర్ బీర్లు మళ్లీ వ‌స్తున్నాయి. ఈ విషయం స్వయంగా యునైటెడ్ బ్రూవరీస్ కంపెనీనే అధికారికంగా ప్రకటించింది. కొన్ని రోజుల కింద తెలంగాణ‌కు కింగ్ ఫిషర్ బీర్లు సరఫరా చేయమని యునైటెడ్ బ్రూవరీస్ సంస్థ ప్రకటించిన విషయం తెలిసిందే. కింగ్ ఫిషర్,హెనికిన్ బీర్ల సరఫరా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అయితే తాజాగా ఆ కంపెనీ తిరిగి బీర్ల స‌ర‌ఫ‌రా పునః ప్రారంభించాల‌ని నిర్ణ‌యం తీసుకుంది.

ఏదైనా పండుగో పబ్బమో ఉన్నా వేసవి కాలమైనా కింగ్ ఫిషర్ బీర్లకు ఉండే డిమాండ్ ప్రత్యేక చెప్పనక్కర్లేదు. అలాంటిది సరఫరానే ఆపేస్తున్నామని ప్రకటించటంతో కేఎఫ్ బీర్ల ప్రియులు ఆందోళ‌న‌కు గుర‌య్యారు. పెండింగ్ బిల్లులు చెల్లించకపోవటం.. కొన్నేళ్లుగా బీర్ల ధరలు పెంచకపోవటంతో.. యునైటెడ్ బ్రూవరీస్ సంస్థ ఇకపై తెలంగాణకు బీర్ల సరఫరా నిలిపేస్తున్నట్టు ప్రకటించింది. మందుబాబులకు వచ్చే ఇబ్బందులను గుర్తించిన రేవంత్ రెడ్డి సర్కార్ ఈ విషయంపై ప్రత్యేక దృష్టి సారించింది. యునైటెడ్ బ్రూవరీస్ సంస్థతో కీలక చర్చలు జరిపింది. చర్చలు సఫలం కావటంతో రాష్ట్రాన్ని కింగ్ ఫిషర్ బీర్ల సరఫరాను మళ్లీ ప్రారంభించాలని నిర్ణయించినట్టు యునైటెడ్ బ్రూవరీస్ సంస్థ సోమ‌వారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.

తెలంగాణ ప్రభుత్వంతో కీలక చర్చల తర్వాత కేఎఫ్ బీర్ల సరఫరా మళ్లీ ప్రారంభించాలని నిర్ణయించినట్లు తెలిపింది యునైటెడ్ బ్రూవరీస్. అయితే.. ప్రస్తుతం ఉన్న ధరలకే సరఫరా చేస్తారా లేక ధరలు పెంచుతారా అన్నది మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది. ధరల విషయంపై త్వరలోనే సమాచారం ఇస్తామని సంస్థ తెలిపింది. ఈ సరఫరా చేసే నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. ఈ మేరకు సోమవారం రోజు స్టాక్ ఎక్స్చేంజీ ఫైలింగ్‌లో యునైటెడ్ బ్రేవరీస్ సంస్థ వెల్లడించింది. సెబీ మార్గదర్శకాలకు అనుగుణంగా స్టాక్ మార్కెట్లో లిస్టయిన కంపెనీలు తమ నిర్ణయాల్ని ఎప్పటికప్పుడు స్టాక్ ఎక్స్చేంజీలకు తెలియజేస్తూనే ఉంటాయి.

Get real time updates directly on you device, subscribe now.

You might also like