10 కోట్ల మంది పుణ్యస్నానాలు

Mahakumbhamela: వణికించే చలి, దట్టమైన పొగమంచు ఇవేవీ లెక్కచేయకుండా త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. త్రివేణీ సంగమంలో స్నానాలు చేసేందుకు ప్రపంచం నలుమూలల నుంచి అంచనాలకు మించి తరలివస్తున్నారు. ఈ కుంభమేళా ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకూ అంటే.. తొమ్మిది రోజుల్లో త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు చేసిన భక్తుల సంఖ్య పది కోట్లు దాటినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. మహాకుంభమేళా.. పవిత్ర స్నానాలు, పిండ ప్రదానాలు భారీగా కొనసాగుతున్నాయి.
జనవరి 13 నుంచి ప్రారంభమైన మహా సంరభం ఫిబ్రవరి 26 వరకు కొనసాగనుంది. భూమండలం మీద అత్యంత భారీగా భక్తులు హాజరయ్యే గొప్ప ఆధ్యాత్మిక వేడుక ఇది. గంగ, యమునలతోపాటు అంతర్వాహినిగా ప్రవహించే సరస్వతీ నది కలిసే త్రివేణీ సంగమంలో సాగే ఈ మహా కుంభమేళా భూమండలంపై జరిగే మహత్తర వేడుక. ఈసారి మహాకుంభమేళాకు 35 కోట్ల మంది భక్తులు వస్తారని ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ మేరకు ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసింది. 10 వేల ఎకరాల పరిధిలో ఈ ఆధ్యాత్మిక నగరాన్ని ఏర్పాటు చేశారు. యాత్రికులకు ఇబ్బంది లేకుండా 1.6 లక్షల టెంట్లను, 1.5 లక్షల మరుగు దొడ్లను నిర్మించారు. మహా కుంభమేళా కేవలం మతపరమైన కార్యక్రమం మాత్రమే కాదని ఇది సామాజిక, ఆధ్యాత్మిక ఐక్యతకు ఇది నిదర్శనమని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు.
మహాకుంభ సమయంలో చేసే అమృత స్నానాలు ప్రత్యేక తేదీల్లో చేస్తారు. ఈ ప్రత్యేక తేదీలు గ్రహాల కదలిక, ప్రత్యేక స్థానం ఆధారంగా నిర్ణయించబడతాయి. మహాకుంభ సమయంలో ఎవరైతే అమృతంలో స్నానం చేస్తారో వారి పాపాలన్నీ నశించి పుణ్యఫలితాలను పొందుతారు. ఈ సమయంలో అమృతంతో స్నానం ఆచరిస్తే మోక్షం లభిస్తుంది ప్రతీతి. మహా కుంభమేళాకు తరలివచ్చే కోట్ల మంది భక్తుల కోసం రైల్వేశాఖ 3వేల ప్రత్యేక రైళ్లతోపాటు మొత్తంగా 13 వేల రైళ్లను నడుపుతోంది. సుమారు 2 కోట్ల మంది రైళ్ల ద్వారా వచ్చే అవకాశముందని అంచనా వేస్తున్నారు. 9 కీలకమైన రైల్వే స్టేషన్లలో 560 టికెట్ కౌంటర్లను ఏర్పాటు చేశారు. మహా కుంభమేళా మొదటి రాజ స్నానం జనవరి 13న పుష్య పూర్ణిమ నాడు. ఇప్పటికే ముగిసింది. రెండవది జనవరి 14 మకర సంక్రాంతి. ఇప్పటికే ముగిసింది. మూడవది మౌని అమావాస్య జనవరి 29 నాడు జరుగుతుంది . నాలుగవది వసంత పంచమి పురస్కరించుకుని ఫిబ్రవరి 3న జరుగుతుంది. ఐదవ రాజ స్నానం మాఘ పూర్ణిమ సందర్భంగా ఫిబ్రవరి 12న జరుగుతుంది. ఫిబ్రవరి 26 మహాశివరాత్రి నాడు చివరి రాజ స్నానం జరగనుంది.