ముచ్చటగా మూడోసారి డకౌట్

Congress Duck Out: 0…. 0…. 0…. వరుసగా మూడు సున్నాలు.. ఇదీ ఢిల్లీ ఎన్నికల్లో (Delhi Assembly Elections) కాంగ్రెస్ పార్టీ దుస్థితి. దాదాపు 15 ఏండ్ల పాటు హస్తినాపురిని ఏకఛత్రాధిపత్యంగా ఏలిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అక్కడ కనీసం తన ప్రభావం కూడా చూపడటం లేదు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. వాస్తవానికి ఆ పార్టీ ఎన్నికల్లో గెలుస్తుందని ఎవరూ భావించలేదు. ఆ ఎన్నికల్లో బీజేపీ, ఆప్ మధ్యే పోటీ ఉంటుందని విశ్లేషకులు, రాజకీయ నేతలు అంచనా వేశారు. అయితే, కాంగ్రెస్ పార్టీకి ఎన్నో కొన్ని సీట్లు వస్తాయని ఆ పార్టీ నేతలు, అభిమానులు భావించారు. కానీ వారి ఆశ అడియాసే అయ్యింది. కనీసం ఒక్క సీటు రాకపోవడంతో వారంతా నిరాశకు గురయ్యారు.
15 ఏండ్లు ఏకఛత్రాధిపత్యం..
వాస్తవానికి 1998 నుంచి 2013 వరకు 15 సంవత్సరాల పాటు దేశ రాజధానిని పాలించిన కాంగ్రెస్, రెండు ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవకపోవడంతో ఆ పార్టీని ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు కూడా అదే చరిత్ర పునరావృతం అయ్యింది. అయితే, ఈసారి ఎలాగైనా గెలవాలని కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేసింది. అయినా ఓటరు దేవుడు కరుణించలేదు. మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రా వంటి సీనియర్ నాయకులు అనేక ర్యాలీలు నిర్వహించడంతో నగర రాజకీయాల్లో తన పట్టును తిరిగి పొందేందుకు సర్వత్రా ప్రయత్నాలు చేశారు. బీజేపీ, ఆప్‌పై విరుచుకుపడ్డారు. ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాకపోవడం నిజంగా ఆ పార్టీకి పెద్ద షాక్‌గానే భావిస్తున్నారు.
ఆప్ ఎదిగేందుకు సహకారం…
కాంగ్రెస్ పార్టీ చేసిన పెద్ద తప్పే ఆ పార్టీకి శాపంగా మారిందని విశ్లేషకులు చెబుతున్నారు. 2013లో కాంగ్రెస్ ఢిల్లీ పతనం ప్రారంభమైంది, ఆ పార్టీ అధికారాన్ని కోల్పోయి 11.4% ఓట్లతో 8 సీట్లకు పరిమితం అయ్యింది. కాంగ్రెస్ అండతో ఆప్ కాస్తా బలపడింది. ఆ ఎన్నికల్లో 40% ఓట్లతో 28 సీట్లు గెలుచుకుంది. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోవడంతో ఓట్ల శాతం 9.7 శాతానికి తగ్గింది. ఐదేళ్ల తర్వాత, కాంగ్రెస్ పతనం ఆగలేదు.. ఆ పార్టీ ఓట్ల శాతం ఆల్ టైమ్ కనిష్ట స్థాయి 4.6%కి పడిపోయింది. ఆ ఎన్నికల్లో సైతం ఆప్ విజయకేతనం ఎగరవేసింది. ఇప్పుడు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌తో బంధాన్ని తెంచుకున్న కాంగ్రెస్, అరవింద్ కేజ్రీవాల్‌పై ఆ పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ నాయకత్వం వహించడంతో ఢిల్లీలో చాలా దూకుడుగా ప్రచారం జరిగింది. అయినా, ప్రజలు మాత్రం ఆ పార్టీని ఆదరించలేదు.
వరుస పరాజయాలతో కుదేలు..
కాంగ్రెస్ పార్టీ ఈ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కొంతమేర పుంజుకుంది. 2014 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 44 స్థానాలు సాధించగా.. 2019 ఎన్నికల్లో 52 సీట్లు సాధించింది. 2024లో మాతం అనూహ్యంగా 99 స్థానాల్లో గెలుపొందింది. ఆ ఫలితాల తర్వాత కాంగ్రెస్ పుంజుకుంటోందన్న నమ్మకం కలిగింది. అయితే, లోక్సభ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించిన హస్తం పార్టీ.. రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం వరుసగా ఓటమి పాలవుతూ వస్తోంది. కనీసం ప్రత్యర్థి పార్టీకి పోటీ కూడా ఇవ్వలేకపోతోంది. లోక్‌సభ ఎన్నికల తర్వాత జరిగిన హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం పాలైంది. ఇక మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే పరిస్థితి. కాంగ్రెస్ నేతృత్వంలోని మహావికాస్ అఘాడీ ఘోర పరాజయం పాలైంది. ఇప్పుడు ఢిల్లీలో కనీసం ఖాతా కూడా తెరవకపోవడం గమవార్హం. దీంతో లోకసభ ఎన్నికల్లో మంచి ఫలితాలు రాబట్టడానికి గల కారణం కాంగ్రెస్ పార్టీ కాదని.. ఆ పార్టీ మిత్రపక్షాల వల్లే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పుంజుకుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
బీజేపీని గెలిపించిన కాంగ్రెస్
గతంలో ఆప్‌తో జతకట్టి ఆ పార్టీ బలపడానికి కారణం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీనే. హస్తం అండతో ఆప్ భారీ విజయాలు నమోదు చేసుకుంది. ఆ పార్టీ వేళ్లూనుకుపోయింది. కేవలం ఢిల్లీలోనే కాకుండా మిగతా ప్రాంతాల్లో సైతం విజయాలు నమోదు చేసుకుంది. అయితే, ఆ పార్టీకి అండగా నిలబడిన కాంగ్రెస్ మాత్రం చతికిలపడింది. ఇక ఇప్పుడు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయానికి పరోక్షంగా బాటలు వేసిందని విశ్లేషకులు చెబుతున్నారు. చాలా చోట్ల బీజేపీ, ఆప్ అభ్యర్థుల మధ్య టఫ్ ఫైట్ జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఓట్ల చీల్చడంతో బీజేపీ గెలుపు ఖాయమైంది. నేషనల్ కాన్ఫరెన్స్ సీనియర్ నాయకుడు, జమ్మూకాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ఆప్, కాంగ్రెస్ పార్టీలు ఢిల్లిలో విడివిడిగా పోటీచేసినందువల్లే ఈ చేదు ఫలితం చవిచూడాల్సి వచ్చిందని విరుచుకుపడ్డారు. ఇంకా మీలో మీరే కొట్టుకుంటూ ఉండండి.. ఒకరినొకరు నాశనమయ్యే వరకూ ఇలానే చేసుకోండి.. అంటూ ఇండియా కూటమిలో ఐక్యత కొరవడటంపై ఎక్స్ వేదికగా తీవ్రంగా విమర్శించారు.