తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జీగా మీనాక్షి నటరాజన్

Congress: పలు రాష్ట్రాలకు ఇన్‌చార్జీలను నియమిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఏఐసీసీ ఒక ప్రకటన విడుదల చేసింది. తెలంగాణ ఇన్‌చార్జీగా దీపాదాస్ మున్షీ స్థానంలో మీనాక్షి నటరాజన్ నియమించారు. రాహుల్‌గాంధీ టీమ్‌లో కీలకంగా ఉన్న మీనాక్షి నటరాజన్ .. తెలంగాణ ఇన్‌ఛార్జ్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. మధ్యప్రదేశ్‌కు చెందిన మీనాక్షి నటరాజన్.. కాంగ్రెస్ పార్టీలో కింది స్థాయి నుంచి పని చేస్తూ వచ్చారు. ఎన్ఎస్‌యూఐ, యూత్ కాంగ్రెస్ వింగ్ లలో అలాగే.. AICCలో కీలక బాధ్యతల్లో పనిచేశారు. 2009 ఎన్నికల్లో మధ్యప్రదేశ్‌లోని మంద్‌సౌర్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు.
తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇంఛార్జి మార్పు ఖాయమంటూ ఆ పార్టీ వర్గాలు పేర్కొంటూ వచ్చాయి.. దీపాదాస్ మున్షీ కేరళ, తెలంగాణ రెండు రాష్ట్రాలకు ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారు. ఈ క్రమంలో తెలంగాణను పట్టించుకోవట్లేదన్న ఆరోపణలున్నాయి. కార్ గిప్టుల ఆరోపణలు…టికెట్ ల విషయంలో గోల్ మాల్ …అసలు వాళ్లకు కాకుండా కొసరు వాళ్లకు టికెట్లు ఇప్పించారనే ఆరోపణలు..కొత్త లీడర్లను అంటే డబ్బున్న వారిని ప్రోత్సహించారనే ఆరోపణలు ఎదుర్కోన్నారు. సీనియర్లు కలవకుండా, ఫోన్ లిఫ్ట్ చేయకుండా అవమానిస్తున్నారన్న చర్చ పార్టీలో నడుస్తూ వచ్చింది.. దీపాదాస్ మున్షీ తీరుతో పార్టీకి నష్టం జరుగుతుందని ఆమెను మార్చాలని తెలంగాణ నేతలు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాయి. ఈ క్రమంలోనే.. ఆమెను మార్చి తన స్థానంలో మీనాక్షి నటరాజన్‌ను నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
తెలంగాణకు ప్రత్యేకంగా సమస్యలను పరిష్కరించే సత్తా ఉన్న, అంతర్గత అసమ్మతి మేనేజ్ చేయడంలో అనుభవం ఉన్న సీనియర్ నేతను నియమించాలని హైకమాండ్ ఆలోచించింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ తదితర సీనియర్ నేతలు గురువారం న్యూఢిల్లీలోని ఖర్గే నివాసంలో సమావేశమయ్యారు. తెలంగాణ ఇన్‌ఛార్జ్‌గా ఉన్న దీపా దాస్‌మున్షీ స్థానంలో కొత్త వారిని నియమించాలని నిర్ణయం తీసుకున్నారు. చాలా మంది సీనియర్ నేతల పేర్లు పరిశీలనలోకి వచ్చినా చివరకు మీనాక్షి పేరును ఖరారు చేశారు. ఒక దశలో సచిన్ పైలట్ పేరు కూడా వినిపించింది. ఛత్తీస్‌గఢ్ ఇన్‌ఛార్జ్‌గా ఉన్న సచిన్ పైలట్ ఆ పాత్రలో కొనసాగడానికి పెద్దగా ఆసక్తి చూపలేదని, బదులుగా తెలంగాణ వ్యవహారాలను నిర్వహించడానికి ఆసక్తి చూపుతున్నారని కూడా వర్గాలు పేర్కొన్నాయి.
తెలంగాణలో ఈమధ్య కాలంలో పార్టీపరంగా ఇబ్బందులు తలెత్తుతున్న నేపథ్యంలో పార్టీ పనితీరును చక్కటి యంత్రంగా ఉండేలా ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులతో సమన్వయం చేసుకునేలా ఉండాలని తెలంగాణకు చెందిన సీనియర్ నాయకులు అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లారు. ఈ నేపథ్యంలో పార్టీలో అన్ని స్థాయిల్లో పనిచేసిన మీనాక్షి నటరాజన్ వైపు కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు చూపింది.