పదవి పక్కా..

Congress: రేఖా నాయక్(Rekha Shyam Nayak)ను పదవి వరించబోతోందా..? కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆమెను గుర్తించి ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం ఖరారు చేస్తారా…? గంపెడంత ఆశలతో ఎమ్మెల్సీ అభ్యర్థిత్వంపై ఎదురు చూస్తున్న రేఖా నాయక్ గీత మారుతుందా..? ఎస్టీ సామాజిక వర్గం పైగా మహిళ ఆ కోటాలో భర్తీ చేయనున్నారా..? ఇంతకీ రేఖానాయక్ పేరు ఎందుకు బలంగా వినిపిస్తోంది..? ఆమెకున్న రాజకీయ నేపథ్యం ఏమిటి..? అధిష్టానం ఆలోచన ఏంటీ..? నాంది న్యూస్ ప్రత్యేక కథనం..
రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలకు(MLC Elections) సంబంధించి అభ్యర్థుల ఖరారుపై ఆసక్తికర చర్చ సాగుతోంది. సామాజిక వర్గాల వారీగా తమకో పదవి అంటూ ఒక్కో నేత ముందుకు వస్తున్నారు. తమ సామాజిక వర్గానికి లేదా ఉత్తర తెలంగాణలో మహిళలకు ప్రాధాన్యత కల్పించాలనే డిమాండ్ ముందు పెట్టి పలువురు నేతలు తమ అనుచరులకు పదవి ఇప్పించేందుకు తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. అదే సమయంలో తమ గాడ్‌ఫాదర్ల చుట్టూ నేతలు చక్కర్లు కొడుతున్నారు. కొంత మంది ఢిల్లీకి వెళితే, మరికొందరు హైదరాబాద్ కేంద్రంగా తమ అభ్యర్థిత్వం కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. రేపటితో నామినేషన్ల స్వీకరణ గడువు ముగుస్తుండగా ఈ రోజు రాత్రి వరకు కాంగ్రెస్ అధిష్టానం అభ్యర్థులను ఖరారు చేయనుండగా జాబితాలో ఎవరికి చోటు దక్కుతుందనే ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ పార్టీకి ఉన్న బలానికి ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీగా నలుగురికి చోటు దక్కుతుంది.
రేఖానాయక్ తీవ్ర ప్రయత్నాలు..
రేఖానాయక్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నాలుగు ఎమ్మెల్సీ పదవులకు సంబంధించి ఉన్నత వర్గాలకు కాకుండా బడుగు బలహీన వర్గాలకు మాత్రమే ఇవ్వాలని అధిష్టానం యోచిస్తోంది. ఇదే క్రమంలో ఎస్టీ కోటా పైగా మహిళ కాబట్టి తనకు అవకాశం ఇవ్వాలని ఇప్పటికే రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ మీనాక్షి నటరాజన్ దృష్టికి తీసుకువెళ్లారు. తన బయోడేటా సైతం సమర్పించారు. అప్పటి నుంచి ఆమె ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఢిల్లీలో ఆమె భర్త శ్యాం నాయక్ ఉండటంతో ఆయన ద్వారా అధిష్టానం దృష్టికి సైతం పదవి విషయం తీసుకువెళ్లారు. ఇలా అన్ని రకాలుగా తనకు ఉన్న మార్గాల ద్వారా పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.
ఎవరీ రేఖానాయక్..?
ఆమె నోరు తెరిస్తే ఎవర్నీ లెక్క చేయని తత్వం… రెండు సార్లు ఎమ్మెల్యే, ఒకసారి జడ్పీటీసీగా రాజకీయ అనుభవం ఉంది. మహిళలు, పిల్లలు, వికలాంగులు, వృద్ధుల సంక్షేమ కమిటీ చైర్మన్ గా కూడా చేశారు. ఉద్దండపిండాలను ఎదుర్కొని ఖానాపూర్ గడ్డపై రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఎవరికీ భయపడని తత్వం ఆమెలో ఉంది. బీఆర్ఎస్‌లో రెండుసార్లు ఎమ్మెల్యే అయినా, మూడోసారి టిక్కెట్టు ఇవ్వకపోవడంతో అధిష్టానాన్ని మాటలతో చీల్చి చెండాడింది. రాజకీయ కురువృద్ధులుగా పేరొందిన నేతలను సైతం చెమటలు పట్టిస్తుందని పేరొందింది. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ ఎస్ టిక్కెట్టు ఇవ్వకపోవడంతో ఎమ్మెల్యేగా ఉండగానే కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో అటు అసెంబ్లీ, ఇటు ఎంపీ ఎన్నికల్లో సైతం పోటీకి దూరంగా ఉండిపోయారు. పార్టీలో కొనసాగుతూ వచ్చారు.
అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందా..?
రేఖానాయక్ తాను పదవి ఎందుకు ఆశిస్తున్నానో కూడా చెబుతున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీగా పోటీ చేసి ఓడిన వారికి టిక్కెట్టు ఇవ్వొద్దని అధిష్టానం ఆలోచన. తాను పార్టీలోకి వచ్చినప్పటి నుంచి పోటీ చేయలేదని, పార్టీ పదవి కూడా ఆశించలేదని ఈ నేపథ్యంలోనే తనకో అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు.. అయితే, వారం రోజుల కిందట ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలోనే మీనాక్షి నటరాజన్ రేఖానాయక్‌కు మీరు పదవి పక్కా అని చెప్పినట్లు సమాచారం. దీంతోనే రేఖానాయక్ తనకు పదవి వస్తుందని ధీమాతో ముందుకు సాగుతున్నారు.
మరి ఆమె ఆశించినట్లు, అధిష్టానం హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్సీ పదవి వస్తుందా..? రాదా..? అనేది ఈ రోజు రాత్రిపొద్దుపోయేవరకు తేలనుంది.