రావి శ్రీనివాస్ కి షోకాజ్ నోటీసులు

Congress: సిర్పూర్ కాంగ్రెస్ పార్టీలో రాజకీయం రోజుకో రకంగా మారుతోంది. పార్టీలో అంతర్గత కలహాలు ఇప్పట్లో సమసేలా కనిపించడం లేదు. సిర్పూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జీ రావి శ్రీనివాస్ (Sirpur Congress Party In-charge Ravi Srinivas)కు పార్టీ క్రమ శిక్షణ కమిటీ నోటీసులు జారీ చేసింది. ఇటీవల జిల్లా ఇన్‌చార్జీ మంత్రి సీతక్కతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలపై రావి శ్రీనివాస్ విమర్శలు చేశారు. అంతేకాకుండా మీడియా ముందు బహిరంగ ఆరోపణలు చేశారు. ఈ మధ్య కాలంలో పార్టీ కార్యక్రమాల్లో సైతం సక్రమంగా పాల్గొనడం లేదు.
దీంతో సిర్పూరు కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జీ రావి శ్రీనివాస్ను పార్టీ నుంచి తొలగించాలని కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా(Komuram Bhim Asifabad District) డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్ రావు(DCC President Vishwaprasad Rao) పార్టీ క్రమ శిక్షణ కమిటీకి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆయన టీపీసీసీ క్రమశిక్షణా సంఘం చైర్మన్ పి. చిన్నారెడ్డికి లేఖ రాశారు. ఆయన మహిళా మంత్రి, ఎమ్మెల్సీ, పీసీసీ ప్రధాన కార్యదర్శి ప్రతిష్టకు భంగం కలిగేలా ఆరోపణలు చేశారని, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదని ఆయన లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన బీసీ కులగణన సర్వే కార్యక్రమాన్నిఅడ్డుకోవాలని, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ దురుసుగా ప్రవర్తించారని, అదే విధంగా సమావేశంలో ఎమ్మెల్సీ దండే విఠల్ పై అనుచిత వాఖ్యలు చేసి పార్టీ పరువు పోయే విధంగా ప్రవర్తించారని లేఖలో పేర్కొన్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క, కొడుకుతో పాటు మరికొందరు నేతలపై ఇష్టారాజ్యంగా మాట్లాడిన వ్యవహారాన్ని విశ్వప్రసాద్ పార్టీ దృష్టికి తీసుకువెళ్లారు. పార్టీ ఇన్‌చార్జీ అయ్యి ఉండి పార్టీ కార్యక్రమాల్లో సైతం పాల్గొనడం లేదని లేఖలో పేర్కొన్నారు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకున్న పార్టీ క్రమ శిక్షణ కమిటీ నోటీసులు జారీ చేసింది. వారం లోపు వివరణ ఇవ్వాలని కమిటీ ఆ నోటీస్ లో పేర్కొంది.