కొత్త చెరువులు, పూడిక తీత‌లు

-సింగరేణి ప్రాంతాల్లో 102 చెరువుల నిర్మాణం, పూడిక తొలగింపు
-జోరుగా సాగుతున్న‌ నీటి బిందువు - జలసింధువు కార్యక్రమం
-ఇప్పటికే 20 శాతం చెరువుల నిర్మాణాలు పూర్తి
-కనీస చెరువు వైశాల్యం ఒక హెక్టారు ఉండేలా చర్యలు
-సమీక్ష సమావేశంలో సంస్థ ఛైర్మన్ ఎండీ ఎన్.బలరామ్
-సింగ‌రేణి ఆధ్వ‌ర్యంలో పెద్దఎత్తున‌ జ‌ల వ‌న‌రుల సంర‌క్ష‌ణ ఉద్య‌మం

Singareni: సింగరేణి ప్రాంతంలో భూగర్భ జలాల పెంపుదల లక్ష్యంగా సంస్థ ఛైర్మన్ ఎన్.బలరామ్(Singareni CMD N.Balaram) “నీటి బిందువు జల సింధువు” పేరుతో కార్య‌క్ర‌మం ప్రారంభించారు. ఆయ‌న ప్రారంభించిన మినీ చెరువుల నిర్మాణం వేగవంతంగా సాగుతోంది. మే 15 నాటికి సింగరేణి వ్యాప్తంగా మొత్తం 12 ఏరియాల్లో 62 కొత్త చెరువుల నిర్మాణం, 40 చెరువుల్లో పూడిక తొలగింపు పూర్తి చేయాలని ఆదేశించారు. హైదరాబాద్ సింగరేణి భవన్లో సోమవారం సాయంత్రం నిర్వహించిన సమీక్ష సమావేశంలో అన్ని ఏరియాల జీఎంలకు, సంబంధిత పర్యావరణ, సివిల్ శాఖల అధికారులకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు.

ఇప్పటికి 20 శాతం పైగా పనులు పూర్తయ్యాయని, పనులను మరింత వేగంగా చేస్తూ మే 15 నాటికి మొత్తం చెరువుల నిర్మాణం పూర్తి చేయాలన్నారు. రానున్న వర్షాకాలంలో సింగరేణి నిర్మించిన ఈ చెరువుల్లో నీరు పుష్కలంగా చేరే విధంగా త‌గిన పనులు పూర్తి చేయాలని సీఎండీ ఆదేశించారు. మినీ చెరువుల చుట్టూ కంచెలు ఏర్పాటు చేయాలని సూచించారు. సింగరేణి సమీప గ్రామాలలో భూగర్భ జలాలు పెంచడం కోసం తీసుకున్న ఈ బృహత్ కార్యక్రమాన్ని ప్రతి ఏరియా జీఎం ప్రత్యేక శ్రద్ధతో విజయవంతం చేయాలని సూచించారు. తొలుత 50 మినీ చెరువులు నిర్మించాలని భావించినా, గనుల ప్రాంతంలో ఉన్న అవకాశాలను పరిగణలోకి తీసుకొని వీటి సంఖ్యను 62కు పెంచారు. ఇప్పటికే ఉన్న 40 చెరువుల్లో నీటి సామర్థ్యం పెంపుదలకు పూడిక తొలగింపు పనులు చేపట్టాలని నిర్ణయించారు. సింగరేణిలో గతంలో కేవలం అక్కడక్కడ చెరువుల పూడికను కొన్ని ఏరియాలో తీసిన దాఖలాలు ఉన్నాయి కానీ పెద్ద ఎత్తున చెరువుల నిర్మాణాన్ని చేపట్టడం గతంలో ఎన్నడూ జరగలేదు. ఈ చెరువుల నిర్మాణం సింగరేణి సమీప ప్రాంత భూగర్భ జలాల పెంపుదలకు ఎంతగానో ఉపయోగపడే అవకాశం ఉంది.

మందమర్రి లో 10 మినీ చెరువులు, కొత్తగూడెంలో 8, భూపాలపల్లి, రామగుండం-1, రామగుండం-2, ఇల్లందు, మణుగూరు, శ్రీరాంపూర్, బెల్లంపల్లి, సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రాలలో ఏరియాకు 5 మినీ చెరువుల చొప్పున, రామగుండం-3 ఏరియాలో 4 మినీ చెరువులను సింగరేణి యాజమాన్యం నిర్మిస్తోంది. సోమవారం సమీక్ష సమావేశంలో సీఎండీ బలరామ్, డైరెక్టర్ ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్స్ పా కొప్పుల వెంకటేశ్వర్లు, సింగరేణి అటవీ శాఖ అడ్వైజర్ మోహన్ పరిగిన్, పర్యావరణ శాఖ జనరల్ మేనేజర్ సైదులు, అధికారులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like