చదువులో గెలిచినా… మృత్యువుతో ఓడింది…

Tenth class exam results: ఆ చిన్నారి పెద్ద చదువు చదవాలనుకుంది.. ఎంతో కష్టపడి చదివింది… చదువే లోకంగా సాగింది.. అయితే, అనారోగ్యం మాత్రం తనని తోడు తీసుకువెళ్లింది.. చనిపోయిన పది రోజుల తర్వాత వచ్చిన ఫలితాల్లో ఆ పాఠశాలకే టాప్ స్కోరర్‌గా నిలిచింది.. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మల్లాపూర్ గ్రామానికి చెందిన ఆకుల రవి, రజిత దంపతులకు ముగ్గురు కూతుళ్లు. అందులో చిన్న కూతురు నాగచైతన్య (15). తను అదే గ్రామంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో చదువుతోంది. ఏడాదిగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆ బాలిక పదవ తరగతి పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తోంది. అయితే, హఠాత్తుగా ఏప్రిల్ 17న అనారోగ్యంతో నాగచైతన్య మరణించింది. బుధవారం వెలువడిన ఫలితాల్లో 510 మార్కులు సాధించి ఆ పాఠశాలకు టాపర్‌గా నిలిచింది. విషయం తెలుసుకుని బాలిక తల్లిదండ్రులు కన్నీటిపర్యంతం అయ్యారు