చావు దెబ్బ కొడతాం

PM Modi : పాకిస్తాన్ ఎలాంటి దుస్సాహసానికి పాక్ తెగబడినా భారత్ దళాలు చావు దెబ్బ కొట్టేందుకు సిద్ధంగా ఉన్నాయని భారత ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత జాతినుద్దేశించి మొదటిసారిగా ప్రసంగించారు మోదీ.. సర్జికల్ స్ట్రైక్స్, బాలాకోట్ దాడులు, ఆపరేషన్ సిందూర్.. ఉగ్రవాదంపై భారత్ వైఖరిని విస్పష్టంగా చెప్పాయన్నారు. ఉగ్రవాదంపై భారత్ షరతుల మేరకే చర్చలు ఉంటాయని, భారత్ నిర్ణయాలకు అనుగుణంగానే చర్చలు సాగుతాయన్నారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఎక్కడ ఉన్నా భారత్ తుదముట్టించి తీరుతుందని ప్రధాని మోదీ పాకిస్తాన్‌ను హెచ్చరించారు.
ఆపరేషన్ సింధూర్ లక్ష్యం అదే..
భారతీయ మహిళల నుదిటిపై సిందూరం తుడిచేసే వారికి ఎలాంటి బుద్ధి చెప్పాలో అదే ఆపరేషన్ సింధూర్ అన్నారు. ఉగ్రవాదులు కలలో కూడా ఊహించనంత దారుణంగా భారత్ దెబ్బతీసిందని, ఉగ్రవాదుల శిబిరాలపై భారత మిసైళ్లు, డ్రోన్లు కచ్చితమైన లక్ష్యంతో దాడులు నిర్వహించాయన్నారు. బహావల్పుర్, మురుడ్చే లాంటి తీవ్రవాద స్థావరాలపై దాడి చేసి భీతావహ పరిస్థితిని భారత్ సృష్టించిందని స్పష్టం చేశారు. పాక్ గర్వంగా చెప్పుకొనే మిసైళ్లను ధ్వంసం చేశాం. పాకిస్థాన్ విమానాలు గాల్లోకి ఎగరలేని పరిస్థితి భారత్ తీసుకొచ్చిందన్నారు. భారత్ చర్యలకు బెంబేలేత్తిపోయిన పాకిస్థాన్ కాల్పుల విరమణకు ప్రపంచం మొత్తాన్ని వేడుకుందని మోదీ వెల్లడించారు.
ఉగ్ర తండాలను తుదముట్టించాం..
రెండున్నర దశాబ్దాలుగా పాక్‌లో విచ్చలవిడిగా తిరుగుతున్న ఉగ్రవాద తండాలను ఒక్క దెబ్బతో భారత్ తుడిచి పెట్టిందని మోదీ స్పష్టం చేశారు. భారత్ కు వ్యతిరేకంగా పాక్ నుంచి కుట్రలు పన్నుతున్న ఉగ్రతండాలను తుదముట్టించిందని, భారత్ దెబ్బకు పాక్ నిరాశనిస్పృహల్లో కూరుకుపోయింది. అచేతనావస్థకు చేరుకుంది. దాడులతో ఏటూ పాలుపోని పాక్ భారత్లోని జనావాసాలు, పాఠశాలలపై దాడికి దిగిందన్నారు. పాక్ నుంచి ప్రయోగించిన డ్రోన్లు. మిసైళ్లను భారత్ క్షిపణి రక్షణ వ్యవస్థ సరిహద్దులు దాటకుండానే కూల్చేసిందని వెల్లడించారు. పాక్ రక్షణ వ్యవస్థలను భారత క్షిపణులు చిన్నాభిన్నం చేశాయని చెప్పారు. పాక్ గర్వంగా చెప్పుకునే మిసైళ్లు, రక్షణ వ్యవస్థల్ని నిర్వీర్యం చేసిందని వివరించారు. పాక్ వైమానిక స్థావరాలు, రాడార్ స్టేషన్లలో భారత్ మిసైళ్లు విద్వంసం సృష్టించాయని మోదీ చెప్పారు.