సరస్వతీ నది పుష్కరాలు ప్రారంభం..

Saraswati Pushkaralu :కాళేశ్వరం త్రివేణి సంగమంలో సరస్వతి పుష్కర స్నానాలు (Saraswati Pushkaralu) గురువారం ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామున మాధవానంద సరస్వతీ పుష్కరాలను ప్రారంభించారు. కాళేశ్వరాలయం నుంచి మంగళ వాయిద్యాలతో త్రివేణి సంగమం వద్దకు చేరుకొని గణపతి పూజతో క్రతువు ప్రారంభించారు. నదిలో నీటికి పంచ కలశాలలో ఆవాహన పూజ చేశారు. నదీమాతకు చీర, సారెతో ఒడి బియ్యం, పూలు, పండ్లు సమర్పించారు. పుష్కరాల సందర్భంగా గణపతి పూజలో తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు దంపతులు పాల్గొన్నారు. ఈ పుష్కరాల కోసం భక్తులు భారీగా తరలివస్తున్నారు. గురువారం నుంచి మే 26 వరకు 12 రోజుల పాటు సరస్వతి పుష్కరాలు జరుగనున్నాయి. ఇవాళ సాయంత్రం కాళేశ్వరంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటించనున్నారు.
సాయంత్రం నాలుగు గంటలకు 17 అడుగుల సరస్వతి మాత విగ్రహాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత పుష్కర స్నానం చేసి కాళేశ్వర-ముక్తీశ్వర స్వామిని రేవంత్‌రెడ్డి దర్శించుకోనున్నారు. సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు సరస్వతీ హారతి కార్యక్రమానికి హాజరుకానున్నారు. పుష్కరాల కోసం రూ. 35 కోట్లతో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. సరస్వతీ పుష్కరాల కోసం తెలంగాణ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు తరలిరానున్నారు. పుష్కరాలకు రోజుకు లక్ష నుంచి లక్షన్నర మంది భక్తులు వస్తారని అంచనా.