పుష్కరాల్లో ఎండ్లబండ్ల సవారీ

Saraswati Pushkaram 2025: కార్లు, బస్సులు, వీలైతే విమనాలు, హెలికాప్టర్లు.. ఇలా ఆధునిక కాలంలో జనం రవాణా సాధనాలు ఉపయోగిస్తున్నారు. కాలు అడుగు తీసి బయట పెడితే ఏదో ఒక వాహనం ఉండాల్సిందే. దూరం అయినా సరే.. దగ్గర అయినా.. ఇలా ప్రతి దానికి వాహనాలు వాడుతున్నారు.ఎండ్లబండ్లు అయితే కనుమరుగే అయ్యాయి. ఎక్కడో ఒక చోట తప్ప అవి కంటికి కూడా కనిపించడం లేదు. చివరకు గ్రామీణ ప్రాంతాల్లో సైతం జనం టూ వీలర్లు వాడుతున్నారు. కానీ, సరస్వతీ పుష్కరాల్లో మాత్రం ఎండ్ల బండ్ల సవారీ కొనసాగుతోంది… చాలా మంది ఇవే దిక్కవుతున్నాయి..
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో ఈ నెల 15 నుంచి సరస్వతి పుష్కరాలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు సైతం చేసింది. గోదావరి, ప్రాణహితతో పాటు అంతర్వాహినిగా సరస్వతి నది ప్రవహించడం వల్ల త్రివేణి సంగమంలో సరస్వతి పుష్కరాలు తొలి సారిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. తెలంగాణ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం భక్తులు భారీగా తరలివస్తున్నారు. ప్రభుత్వం ప్రత్యేకంగా బస్సులు సైతం ఏర్పాటు చేసింది. బస్సులు, సొంత వాహనాల ద్వారా భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.
అయితే, ఇక్కడకు వచ్చిన తర్వాత పార్కింగ్ వద్ద నుంచి ఘాట్లకు వెళ్లేందుకు ఇబ్బందులు తప్పడం లేదు. ఎండాకాలం పైగా వేడిమి కావడంతో ఇసుకలో నడవాలంటే ఇబ్బందికర పరిస్థితి. వృద్ధులు, మహిళలు, చిన్నారులకు ఇక్కట్లు తప్పడం లేదు. దీంతో ఇక్కడ కొందరు కచ్చురాలు ఏర్పాటు చేసుకున్నారు. దాదాపు నలభై వరకు ఉన్నాయి. ఈ కచ్చురాల ద్వారా ప్రజలను ఘాట్ల వద్దకు చేరుస్తున్నారు. ఒక్కొక్కరి వద్ద రూ. 50 వసూలు చేస్తున్నారు. అటు వాళ్లకు ఉపాధి లభించడంతో పాటు ప్రజలు సైతం కచ్చురం సవారీ ఎంజాయ్ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా చిన్నారులు ఎప్పుడూ చూడని ఎండ్లబండ్లపై వెళ్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.