ధాన్యం కొనుగోలు యజ్ఞంలా కొనసాగుతోంది
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

Collector: జిల్లాలో ధాన్యం కొనుగోలు యజ్ఞంలా కొనసాగుతోందని కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. జిల్లాలో 3 లక్షల 30 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం అంచనా దిగుబడి రావాల్సి ఉందన్నారు. జిల్లాలో ఏర్పాటు చేసిన 345 కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 1 లక్షల 30 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లులకు చేరిందని, 36 కొనుగోలు కేంద్రాలు సేకరణ లక్ష్యం పూర్తి చేసి మూసి వేసినట్లు తెలిపారు. జిల్లాలో 7 వేల మంది రైతుల ఖాతాలలో రూ. 108 కోట్లు జమ చేశామన్నారు. ధాన్యం సేకరణలో జిల్లాలోని 20 మిల్లులు, కరీంనగర్లోని 64 మిల్లులే కాకుండా పెద్దపల్లి జిల్లాలోని మిల్లులకు 40 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కేటాయించినట్లు వెల్లడించారు. జిల్లాలో 1.5 సెంటీమీటర్ల వర్షం పడిందన్నారు.
జిల్లాలో 345 కొనుగోలు కేంద్రాలలో ఒక కేంద్రానికి 15 నుంచి 20 మంది చొప్పున దాదాపు 6900 మంది హమాలీలు, 1725 మంది సిబ్బంది, 18 మంది తహశిల్దార్లు, 18 మంది మండల ప్రత్యేక అధికారులు, వ్యవసాయ అధికారులు, 85 మంది విస్తరణ అధికారులు, పౌరసరఫరాల అధికారులు, జిల్లా గ్రామీణాభివృద్ధి, సహకార శాఖల అధికారులు, జిల్లా అదనపు కలెక్టర్ తనతో కలిపి మొత్తం 7 వేల మందికి పై చిలుకు అధికారులు ధాన్యం కొనుగోలు ప్రక్రియ యజ్ఞంలా కొనసాగిస్తున్నామని కుమార్ దీపక్ స్పష్టం చేశారు. సేకరణ ప్రక్రియ ముగింపు దశకు వచ్చిందన్నారు. రైతుల సౌకర్యార్థం జిల్లాలో ప్రత్యేక కాల్ సెంటర్ ఏర్పాటు చేసి 6303928683 నంబర్ అందుబాటులో ఉంచి 24×7 సేవలు అందిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.
గోనె సంచులు 62.50 లక్షలు అవసరం కాగా 52.09 లక్షలు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయని చెప్పారు. 45.43 లక్షల సంచులు కొనుగోలు కేంద్రాలకు అందించామని, 6.63 లక్షల సంచులు గోదాములో ఉన్నాయన్నారు. గతంలో లేని విధంగా 3 సెకార్లను 4 సెక్టార్లుగా పెంచి 400 పైచిలుకు లారీలు అందుబాటులో తీసుకువచ్చామని తెలిపారు. జిల్లాలో సింగరేణి ఉండటం వలన లారీల కొరత లేదని, లారీలు అందుబాటులో ఉన్నాయన్నారు. అవసరమైన మేర టార్పాలిన్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. గతంతో పోల్చితే మరింత మెరుగ్గా, వేగంగా రైతులకు సేవలు అందుతున్నాయన్నారు ఎలాంటి సమస్యలు తలెత్తినా పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్, జిల్లా అదనపు కలెక్టర్ అందుబాటులో ఉంటారని, కాల్ సెంటర్లో సంప్రదించవచ్చని, అన్ని వేళలా అందుబాటులో ఉంటామని కలెక్టర్ కుమార్ దీపక్ స్పష్టం చేశారు.