నకిలీ విత్తన విక్రయాలు అరికట్టాలి

జిల్లాలో నకిలీ విత్తన రవాణా, విక్రయం, వినియోగాన్ని అరికట్టే విధంగా అధికారులు సమన్వయంతో చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో పోలీసు, వ్యవసాయ శాఖ, తహసీల్దార్‌లతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ బోల్ గార్డ్-3 రకాన్ని నిషేధించారని, వీటిని ఉపయోగించడం చట్ట రీత్యా నేరమన్నారు. రైతులు నకిలీ, పర్యావరణానికి, మానవాళికి హాని కలిగించే విత్తనాలు, ఎరువులను వినియోగించకుండా మండల స్థాయి వ్యవసాయ అధికారులు అవగాహన కల్పించాలని తెలిపారు. జిల్లాలో సాగుకు అవసరమైన పత్తి విత్తనాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. నకిలీ విత్తనాల విక్రయాలు నియంత్రించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని, విక్రయదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు. నకిలీ విత్తనాలు, ఎరువులు షావులకు సరఫరా చేసే ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి చర్యలు తీసుకోవాలన్నారు.
రైతులు సాగు చేస్తున్న విస్తీర్ణానికి అనుగుణంగా విత్తనాలు, ఎరువుల పంపిణీ జరిగేలా చూడాలని తెలిపారు. విత్తనాలు, క్రిమి సంహారక మందులు అమ్మినప్పుడు కొనుగోలు చేసిన వారి వివరాలు రిజిస్టర్లో నమోదు చేయాలన్నారు. నకిలీ, నిషేధిత విత్తనాలు, పీడీఎస్ బియ్యం, నిషేధిత క్రిమిసంహారక మందులు తరలించే వాహనాల సీజ్, వాహన యజమాని, డ్రైవర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. సంబంధిత శాఖల అధికారులతో బృందాలను ఏర్పాటు చేసి తనిఖీలు చేపడతామన్నారు. రైతులకు అవగాహన కల్పించే విధంగా ర్యాలీలు, ప్రదర్శనల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహిస్తామన్నారు
రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా మాట్లాడుతూ నకిలీ విత్తనాల విక్రయం, వినియోగాన్ని నియంత్రించేందుకు అధికారుల సమన్వయంతో టాస్క్ఫోర్స్ బృందాలు చర్యలు తీసుకోవాలన్నారు. నకిలీ విత్తనాల నిల్వ, పంపిణీ కేంద్రాలను గుర్తించి స్వాధీనం చేసుకోవాలని తెలిపారు. సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేయాలన్నారు. విత్తనాల రవాణా నియంత్రించడంలో పోలీసు శాఖ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఉత్పత్తి, రవాణా నియంత్రించగలిగితే నకిలీ విత్తనాలకు అడ్డుకట్ట వేయవచ్చన్నారు. నకిలీ విత్తన వ్యాపారులు రైతులను మభ్యపెట్టకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో మంచిర్యాల డీసీపీ భాస్కర్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి కల్పన అధికారులు పాల్గొన్నారు.