మైసూర్ పాక్ మారిపోయింది…

కాశ్మీర్‌లో ఉగ్రవాదుల దాడి… అనంతరం మన దేశం చేసిన ఆపరేషన్ సింధూర్ తర్వాత భారతీయుల ఆలోచనలు మారిపోతున్నాయి. 27 మంది అమాయక పర్యాటకులను పాక్‌లోని ఉగ్రవాదులు చంపేయడంతో 140 కోట్ల భారతీయుల రక్తం మరిగిపోతోంది. పాకిస్తాన్ అంటేనే ఒక్కొక్కరికి మంట పుడుతోంది.. ఇప్పటికే మన దేశంలో ఉన్న కరాచీ బేకరీల పేర్లు మార్చాలని డిమాండ్లు, ఆందోళనలు, దాడులు జరుగుతున్న వేళ.. తాజాగా మరో కీలక నిర్ణయం వెలుగులోకి వచ్చింది. ఫేమస్ స్వీట్ అయిన మైసూర్ పాక్ పేరులో పాక్ అని ఉండటంతో.. కొందరు స్వీట్ షాప్ ఓనర్లు.. దాని పేరు మార్చేస్తున్నారు. మైసూర్ పాక్ అని కాకుండా మైసూర్ శ్రీ అని కొత్త పేరు పెట్టి విక్రయాలు చేస్తున్నారు.
దేశవ్యాప్తంగా మారుతున్న పేరు..
రాజస్థాన్ జైపూర్‌లోని చాలా స్వీట్ల దుకాణాలు మైసూర్ పాక్ పేరును కాస్తా.. మైసూర్ శ్రీగా మార్చేశారు. అయితే నిజానికి స్వీట్లలోని పాక్ అనే పదానికి పాకిస్తాన్‌కు సంబంధం లేదు. కన్నడలో పాక్ అంటే తీపి అని అర్థం. అయినా, చాలా మందికి ఆ పదమే నచ్చడం లేదు. ఈ నేపథ్యంలోనే రాజస్థాన్ స్వీట్ షాప్ యజమానులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే జైపూర్‌కు చెందిన ఓ స్వీట్ షాప్ యజమాని మీడియాతో మాట్లాడుతూ.. తాము తమ స్వీట్ల పేర్ల నుంచి పాక్ అనే పదాన్ని తొలగించామని పేర్కొన్నారు. దీంతో మోతీ పాక్‌ను మోతీ శ్రీగా.. గోండ్ పాక్‌ను గోండ్ శ్రీ అని.. మైసూర్ పాక్‌ను మైసూర్ శ్రీ అంటూ కొత్త పేర్లు పెట్టినట్లు వివరించాడు. ఇది దేశవ్యాప్తంగా విస్తరిస్తోంది..
ఇంతకీ ఆ పేరు ఎలా వచ్చిందంటే…?
కర్ణాటకలో 1902 నుంచి 1940 వరకు మైసూర్‌ను పాలించిన 24వ మహారాజు 4వ కృష్ణరాజ వడయార్ మంచి భోజనప్రియుడు. కాకాసుర మడప్ప అనే ప్రధాన వంటగాడు రాజుకు కొత్త రకం రుచి చూపిద్దామని చక్కెర, శనగపిండి, నెయ్యి, యాలకులు కలిపి ఓ స్వీట్ చేశాడు. దాని రుచి రాజుకు నచ్చడంతో పేరేంటని అడిగారు. పంచదార పాకంలో శనగపిండి వేసి కలిపాడు కాబట్టి తన రాజ్యం పేరు వచ్చేలా మైసూరు పాక అని చెప్పాడు. తర్వాతి కాలంలో అదే మైసూర్ పాక్‌గా మారింది. అది అసలు విషయం అన్నమాట.
సోషల్‌మీడియాలో ప్రచారం.. పేరు మార్పు..
అయితే, ఇదే ఆషామాషీగా తీసుకున్న నిర్ణయం మాత్రం కాదు.. సోషల్ మీడియాలో కొందరు మీమర్స్ మైసూర్ పాక్ స్వీట్ లోనూ పాక్ అనే పేరు ఉందని.. అర్జంట్ గా మైసూర్ భారత్ అని మార్చాలన్న డిమాండ్లు చేశారు. అయితే, మొదట దీనిని సరదాగా తీసుకున్నా… కొందరు మాత్రం సీరియస్‌గా తీసుకుని మరీ మైసూర్‌పాక్ పేరును మైసూర్ శ్రీగా మార్చేశారు.