కోనేరు కోనప్ప తిరుగుబావుట

Koneru Konappa : కోనప్పకు మళ్లీ కోపమొచ్చింది.. ఆయన మళ్లీ సొంత పార్టీపైనే తిరుగుబావుటా ఎగరేశారు. తనకు గతంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీలే నెరవేరవడం లేదని అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. కాంగ్రెస్ పార్టీని వీడేందుకు సిద్ధవుతున్నారనే చర్చ సైతం కొనసాగుతోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆయన పార్టీ వీడేందుకు సిద్ధమయ్యారు. అయితే, ముఖ్యమంత్రి హామీతో ఆగిపోయారు. కానీ, సీఎం ఇచ్చిన హామీ ఇన్ని రోజులైనా నెరవేరకపోవడంతో మరోమారు కాంగ్రెస్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు కోనేరు..
సొంత పార్టీలో అసమ్మతి.. ఇన్‌చార్జీ మంత్రిపై కినుక.. తాను చెప్పిన అభివృద్ది పనులు ముందుకు సాగకపోవడం.. ఏకంగా ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు నెరవేరకపోవడం ఇలా అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్న మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కాంగ్రెస్ పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ గతంలో మంజూరు ఇచ్చిన అభివృద్ధి పనులు రద్దు చేయించడం ఆయన కోపానికి కారణమైంది. కాంగ్రెస్ పార్టీతోనే రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ఆయన తర్వాత బీఎస్పీ పంచన చేరి, ఆ తర్వాత బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుని అటు నుంచి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు. ఇప్పుడు ఆ పార్టీలోనే ఆయనకు ఇబ్బందులు తప్పడం లేదు.
బ్రిడ్జి, అభివృద్ధి పనుల రద్దుపై ఆగ్రహం..
కోనేరు కోనప్ప ఎమ్మెల్యేగా ఉన్న హయాంలో విడుదల చేయించిన నిధులు, అభివృద్ధి పనులను సైతం రద్దు చేయించడం ఆయనకు పుండు మీద కారం చల్లినట్లైంది. బీఆర్ఎస్ కాలంలో మంజూరు చేయించిన పనులు రద్దు చేశారు. గూడెం బ్రిడ్జి కడితే చింతల మానేపల్లి అభివృద్ధి చెందిందని, కౌటాలలో సైతం బ్రిడ్జి కడితే ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఆయన చెబుతున్నారు. ఈ వ్యవహారంలో మంత్రి సీతక్క ను కలిసి మంజూరు ఇవ్వమంటే సరే అన్నారు .కానీ ఒక్క రోడ్డు కూడా ఇవ్వలేదని కోనప్ప చెబుతున్నారు. అదే సమయంలో ఏకంగా ముఖ్యమంత్రి హామీ ఇచ్చినా కౌటాల బ్రిడ్జికి ఇంకా మంజూరు ఇవ్వలేదని కోనప్ప ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈసారి పార్టీ వీడటం ఖాయం..?
ఈ ఏడాది ఫిబ్రవరిలో కార్యకర్తల సమావేశంలో ఆయన పార్టీ వీడనున్నట్లు పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు. అభివృద్ది చేయకపోతే నాయకులు ఎందుకని…? మీ గ్రామాల్లోకి వచ్చే నాయకులను నిలదీయండంటూ పిలుపునిచ్చారు. ఇలా ఆయన మాట్లాడం పార్టీని వీడనున్నారనే సంకేతాల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వయంగా ఆయనను పిలిపించి మాట్లాడారు. కోనేరు కోనప్పకు స్పష్టమైన హామీ సైతం లభించింది. దీంతో కోనప్ప సైతం వెనక్కి తగ్గారు. అయితే, ముఖ్యమంత్రి హామీ ఇచ్చినా ఆ పనులు అమలు కాలేదు. ఈ నేపథ్యంలోనే తాజాగా కోనేరు కోనప్ప సొంత పార్టీ కాంగ్రెస్ పైనే విరుచుకుపడ్డారు. ఆదివారం నియోజక వర్గంలో తన అనుచరులతో కీలక సమావేశం ఏర్పాటు చేశారు.
చింతల మానేపల్లి మండలంలో సమావేశానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడే ఆయన తన నిర్ణయం ప్రకటించనున్నట్లు సమాచారం.