అంతర్గతంగా మాట్లాడుకుంటే బాగుంటుంది

KTR: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, తన తండ్రి కేసీఆర్‌కు లేఖ రాయటం అది లీక్ కావడం కలకలం రేపుతోంది. లేఖలో పార్టీ విధానాలపై అసహనం వ్యక్తం చేశారు. శుక్రవారం అమెరికా నుంచి హైదరాబాద్ వచ్చిన కవిత తన లేఖను కావాలనే కొందరు మీడియాకు లీక్ చేశారని మండిపడ్డారు. కేసీఆర్ చుట్టూ కొన్ని దెయ్యాలు ఉన్నాయని కవిత ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ రోజు తెలంగాణ భవన్‌లో ప్రెస్‌మీట్ పెట్టారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ తమది ప్రజాస్వామ్య పార్టీ అని.. పార్టీ అధ్యక్షుడికి ఎవరైనా ఏ రూపంలోనైనా సలహాలు, సూచనలు ఇవ్వొచ్చని చెప్పారు. కొన్ని విషయాలు అంతర్గతంగా మాట్లాడుకుంటనే బాగుంటుందని ఇది అందరకీ వర్తిస్తుందని పరోక్షంగా కవితను ఉద్దేశించి అన్నారు.’లోక్‌సభ ఎన్నికలకు ముందు మేం పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమీక్షలు పెట్టాం. వేల మంది కార్యకర్తలతో కూర్చుని గంటల కొద్దీ చర్చించాం. ఈ సందర్భంగా చాలా మంది నేరుగా మైకులో మాట్లాడారు. కొందరు చిట్టీల రూపంలో రాసిచ్చారు. కేసీఆర్‌కు ఉత్తరాలు ఇచ్చినవారు కూడా ఉన్నారు. మా పార్టీలో ఓపెన్ కల్చర్ ఉంటుందని మా పార్టీలో ప్రజాస్వామం ఉందని కేటీఆర్ స్పష్టం చేశారు.
మా పార్టీ అధ్యక్షుడికి ఎవరైనా సూచనలు చేయాలనుకుంటే ఉత్తరాలు రాయెుచ్చు. దాంట్లో పెద్ద విషయం ఏం లేదు. మా పార్టీ నాయకులు ఎవరైనా సలహాలు, సూచనలు లిఖితపూర్వకంగా ఇవ్వొచ్చు. ఎవరమైనా పార్టీలో ఓ హోదాలో ఉన్నా సరే.. కొన్ని విషయాలు అంతర్గతంగా మాట్లాడాల్సినవి ఉంటయ్. వాటిని అంతర్గతంగా మాట్లాడితేనే బాగుంటుంది. పార్టీ ఫోరమ్స్ ఉంటయ్ అధ్యక్షుడిని కలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి అంతర్గతంగానే కొన్ని విషయాలు మాట్లాడితే బాగుంటుంది. ఇది అందరికీ వర్తిస్తది. ఎవరమైనా ఒక్కటే. ఈ పార్టీలో అందరం కార్యకర్తలే. పార్టీలో సలహాలు, సూచనలు ఎలాగైనా ఇవ్వొచ్చ’ని కేటీఆర్ వ్యాఖ్యానించారు.