బీఆర్ఎస్ ను బీజేపీకి ధారదత్తం చేసే కుట్ర

Kavitha :బీఆర్ఎస్‌ను బీజేపీలో విలీనం చేసే కుట్ర జరుగుతోందని కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు. తాను జైలులో ఉన్నప్పుడే ఈ కుట్ర మొదలైందని ఆమె స్పష్టం చేశారు. గురువారం కవిత మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. తనకు నీతులు చెబుతోన్న బీఆర్ఎస్ పార్టీ నేతలు.. తెలంగాణ ప్రయోజనాలపై దృష్టి పెట్టాలంటూ సూచించారు. కేసీఆర్ నీడలో పని చేస్తోన్న వారు.. తనపై ప్రతాపం చూపిస్తున్నారంటూ మండిపడ్డారు.
దమ్ముంటే కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి, బీజేపీపై మీ ప్రతాపం చూపించాలంటూ ఈ సందర్భంగా పార్టీ నేతలకు ఆమె సవాల్ విసిరారు. తాను అసలే మంచి దాన్ని కాదని.. తాను నోరు విప్పితే తట్టుకోలేరంటూ బీఆర్ఎస్ నేతలను హెచ్చరించారు. క్షేత్ర స్థాయిలో ఉద్యమాలు చేయకుండా.. ట్వీట్టర్‌లో మెసేజ్‌లు పెడితే సరిపోతాయా? అంటూ ఆమె ప్రశ్నించారు. తనను రేవంత్ రెడ్డి కోవర్ట్ అనటం కరెక్టేనా? అని నిలదీశారు. పెయిడ్ ఆర్టిస్ట్‌లతో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ బీఆర్ఎస్ పార్టీ నేతలపై కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు.
పార్టీ సోషల్ మీడియాలో తనను టార్గెట్ చేశారని, తన లేఖ లీక్ చేసిందెవరో చెప్పాల్సిందేనని మండిపడ్డారు. లీకు వీరులను పట్టుకోమంటే, గ్రీకు వీరులు దండెత్తారని మండిపడ్డారు. తన జోలికి వస్తే బాగుండదని, కేసీఆర్‌ను తామే నడిపిస్తున్నామని చెప్పుకుంటున్నారని, కేసీఆర్‌ను నడిపించేంత పెద్దవాళ్లా మీరు..? అని ప్రశ్నించారు. కేసీఆర్‌కు నోటీసులు వస్తే ఎందుకు నిరసనలు తెలపలేదని, ఇంకో నేతకు నోటీసులు వస్తే ఎందుకు హంగామా చేశారని ప్రశ్నించారు. తాను వాళ్లలా చిల్లర రాజకీయాలు చేయనని, హుందాగా ఉంటానని పేర్కొన్నారు. పార్టీ చేయాల్సిన పనులు జాగృతి తరపున చేస్తున్నానని కవిత స్పష్టం చేశారు.
బీఆర్ఎస్‌లో కేసీఆర్ ఒక్కరే నాయకుడని, పార్టీలో ఇంకెవరి నాయకత్వాన్ని అంగీకరించనని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఓ మునిగిపోయే నావ అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌తో రాయబారాలు జరిపే అవసరం తనకు లేదన్నారు. తనకు, కేసీఆర్ మధ్య దూరం పెంచే కుట్ర జరుగుతోందన్నారు. తనను దూరం చేస్తే ఎవరికి లాభమో అందరికీ తెలుసునని, కావాలనే తనను ఎంపీ ఎన్నికల్లో ఓడించారని కవిత అన్నారు. బీజేపీ నేతలకు చెందిన హాస్పిటల్స్ ప్రారంభోత్సవాలకు వెళ్ళింది ఎవరో అందరకీ తెలుసునంటూ పార్టీలోని అగ్రనేతలను ఆమె పరోక్షంగా విమర్శించారు. పదవులు కోరినట్లు తనపై పత్రికల్లో తప్పుడు వార్తలు రాయించారన్నారు. కేసీఆర్ లెక్క.. తాను చాలా తిక్కదానినని ఆమె పునరుద్ఘాటించారు.