సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్

Kommineni Srinivas Rao Arrested: సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ అయ్యారు. ఆయనను విజయవాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడ తరలించారు. టీవీ చర్చా కార్యక్రమంలో అమరావతి మహిళలను కించపరిచారనే అభియోగాలతో నమోదైన కేసుల్లో అరెస్టు చేశారు. కొమ్మినేని సాక్షి టీవీలో నిర్వహించిన ఒక చర్చా కార్యక్రమంలో, జర్నలిస్ట్ కృష్ణంరాజు “అమరావతి వేశ్యల రాజధాని” అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు పెద్ద ఎత్తున నిరసనలకు దారితీశాయి. అమరావతి రైతులు, మహిళలు ఈ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్, వైఎస్ భారతి, సాక్షి ఛానల్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు మంత్రి గుమ్మడి సంధ్యారాణి. అమరావతి మహిళలను కించపరిచేలా సాక్షి కథనాలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రకటించారు. తనను అక్రమంగా అరెస్టు చేస్తున్నారని తనకు ఆ వ్యాఖ్యలకు సంబంధం లేదని కొమ్మినేని స్పష్టం చేశారు. తాను ఆ వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టు తెలిపారు. మరోవైపు అమరావతిపై వ్యాఖ్యలు చేసిన జర్నలిస్టు కృష్ణంరాజు కోసం కూడా ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ నుంచి పారిపోయినట్టు సమాచారం.
దాదాపు అన్ని జిల్లాల్లోనూ పోలీసులకు కొమ్మినేని, కృష్ణంరాజుపై ఫిర్యాదులు చేసిన విషయం తెలిసిందే. దీంతో పోలీసులు రంగంలోకి దిగి.. కొమ్మినేనిని అరెస్టు చేశారు. తనను అక్రమంగా అరెస్టు చేస్తున్నారని.. తనకు ఆ వ్యాఖ్యలకు సంబంధం లేదని, తాను ఆ వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టు ఆయన తెలిపారు.