స్థానికం మంట‌లు

Local body elections:స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌పై మంత్రులు చేసిన వ్యాఖ్య‌లు మంట‌లు పుట్టిస్తున్నాయి. మంత్రి వ్యాఖ్య‌ల‌పై టీపీసీసీ చీఫ్‌ మహేష్‌ గౌడ్ సీరియస్ అయ్యారు. కేబినెట్‌ అంశాలను ముందుగానే మీడియాతో మాట్లాడితే ఎలా అంటూ మహేష్‌కుమార్‌ మండిపడ్డారు. అదే స‌మ‌యంలో మంత్రి సీత‌క్క సైతం తాను ఎన్నిక‌ల విష‌యంలో చేసిన వ్యాఖ్య‌ల‌పై స్ప‌ష్ట‌త ఇచ్చారు. నాలుగైదు రోజుల్లో ఎన్నిక‌ల‌పై స్ప‌ష్ట‌త వ‌స్తుంద‌ని మాత్ర‌మే చెప్పాన‌ని నోటిఫికేష‌న్ గురించి ఎక్కడా మాట్ల‌డ‌లేద‌న్నారు.

మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిపై (Minister Ponguleti Srinivas Reddy) టీపీసీసీ చీఫ్‌ మహేష్‌కుమార్‌ గౌడ్ (TPCC Chief Mahesh Goud) సీరియస్‌ అయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలపై పొంగులేటి చేసిన ప్రకటనపై పీసీసీ చీఫ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రిజర్వేషన్ల అంశంతో ముడిపడిన ఎన్నికలపై పొంగులేటి ప్రకటనను టీపీసీసీ చీఫ్‌ తప్పుబట్టారు. కోర్టు పరిధిలో ఉన్న అంశాలపై మంత్రులు మాట్లాడేటప్పుడు అన్ని అంశాలను పరిగణలోకి జాగ్రత్తగా ఉండాలని స్ప‌ష్టం చేశారు. కేబినెట్‌ అంశాలను ముందుగానే మీడియాతో మాట్లాడితే ఎలా అంటూ మండిపడ్డారు. ఒకరి మంత్రిత్వ శాఖపై మరొకరు మాట్లాడటమేంటని ప్రశ్నించారు. అధిష్టానంతో సంప్రదించకుండా ప్రకటనలు చేయొద్దని టీపీసీసీ చీఫ్‌ మహేష్‌కుమార్‌ గౌడ్ సూచించారు.

ఒక కార్య‌క్ర‌మంలో మాట్లాడిన మంత్రి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమైందన్నారు. నెలాఖరులోపు స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌ వస్తుందని తెలిపారు. త్వరలో ఎన్నికల తేదీల ప్రకటన ఉంటుందని అన్నారు. సోమవారం జరిగే కేబినెట్‌ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలపై ఓ నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. తొలుత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు, అనంతరం సర్పంచ్‌, మున్సిపల్‌ ఎన్నికలు ఉంటాయని మంత్రి స్ప‌ష్టం చేశారు. అయితే పొంగులేటి అధిష్టానాన్ని సంప్రదించకుండా స్థానిక సంస్థల ఎన్నికలపై ఎలా మాట్లాడతారని టీపీసీసీ చీఫ్‌ మహేష్‌గౌడ్‌ ప్రశ్నించారు. ఇప్పుడు ఈ వ్యవహారం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.

ఇక ఇదే వ్య‌వ‌హారంలో మంత్రి సీత‌క్క సైతం స్పందించారు. స్థానిక ఎన్నిక‌ల‌పై నాలుగు రోజుల్లో స్ప‌ష్ట‌త వ‌స్తుంద‌ని మాత్ర‌మే తాను చెప్పాన‌ని ఆమె వెల్ల‌డించారు. నోటిఫికేష‌న్ గురించి ఎక్కడా మాట్ల‌డ‌లేద‌ని మంత్రి చెప్పారు. సోమ‌వారం హైదార‌బాద్‌లో మీడియాతో మాట్లాడుతూ… త‌న మాట‌ల‌ను వ‌క్రీక‌రించార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. త‌న‌కు క‌నీస జ్ఞానం ఉంద‌ని, కేబినేట్‌లో నిర్ణ‌యం జ‌ర‌గ‌కుడా తానెలా చెబుతాన‌ని ప్ర‌శ్నించారు. అడ‌వి బిడ్డ‌లం కాబ‌ట్టి ఏది ప‌డితే అది రాయ‌డం ఆవేద‌నకు గురి చేస్తోంద‌ని చెప్పారు. తాను మాట మార్చ‌డం లేద‌ని, ఆ వీడియో బ‌య‌ట‌పెట్టార‌ని సీత‌క్క అన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like