ప్రభుత్వ ఉద్యోగులు.. బీజేపీ నేత.. భారీ భూ కుంభకోణం
ప్రభుత్వ ఉద్యోగులు.. ఓ బీజేపీ నేత కలిసి భారీ భూ కుంభకోణానికి పాల్పడ్డారు. ఇందులో ఏకంగా సబ్ రిజిస్ట్రార్ డబ్బులు తీసుకుని మరీ డబుల్ రిజిస్ట్రేషన్లు చేశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. దీనికి సంబంధించి పోలీసులు పక్కా ఆధారాలతో కేసు నమోదు చేసి నిందితులను పట్టుకున్నారు.
ఆదిలాబాద్ జిల్లాలో కోట్ల రూపాయల విలువైన భూమి నకిలీ పత్రాలతో రిజిస్టర్ చేసుకున్నారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వ ఉద్యోగులు, రియల్ ఎస్టేట్ ఏజెంట్లు.. ఇలా చాలా మంది పాత్రధారులుగా ఉన్నారు. అయితే, ‘మెసేజ్ యువర్ ఎస్పీ’ కార్యక్రమం ద్వారా బాధితుల ఫిర్యాదుతో ఈ మోసం బయటపడింది. ఆదిలాబాద్ చెందిన మిలింద్ కొర్తల్‌వార్ అనే వ్యక్తికి చెందిన ప్లాట్లను ఈ ముఠా అక్రమంగా ఆక్రమించింది. ఈ ప్లాట్లకు సంబంధించిన అసలైన పత్రాలు బాధితుడి వద్ద ఉన్నా, నిందితులు నకిలీ పత్రాలను సృష్టించి అక్రమంగా వాటిని రిజిస్టర్ చేసుకున్నారు. ఈ మోసానికి సంబంధించి సబ్ రిజిస్ట్రార్ దుప్పలపూడి అశోక్‌కు రూ. 7 లక్షలు ముట్టినట్లు చెబుతున్నారు. మిలింద్‌కు సంబంధించిన ప్లాట్లను మళ్లీ రిజిస్టర్ చేసుకున్నారు.
ఫిర్యాదు అందగానే మావల పోలీసులు కుంభకోణానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆధారాలు సేకరించారు. జరిగిన మోసం గ్రహించిన పోలీసులు ఇందులో పాలు పంచుకున్న ఆదిలాబాద్ పట్టణంలోని టీచర్స్ కాలనీకి చెందిన ఆర్డబ్ల్యూఎస్ డీఈఈ నానం వెంకటరమణ, మావలకు చెందిన బీజేపీ నేత, రైల్వే బోర్డు సభ్యుడు ఉష్క మల్ల రఘుపతి, రిమ్స్ ఆయుష్ విభాగం ప్రభుత్వ ఉద్యోగి బెజ్జవార్ సంజీవ్‌కుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠా సుమారు రూ. 2 కోట్ల విలువైన 7 ప్లాట్లను నకిలీ పత్రాలతో అక్రమంగా రిజిస్టర్ చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
సబ్ రిజిస్ట్రార్ దుప్పలపూడి అశోక్ పరారీలో ఉన్నాడు. నిందితులపై బీఎన్ఎస్ సెక్షన్లు 447, 427, 420, 467, 468, 471, 120-B కింద కేసులు నమోదు చేశారు. పరారీలో ఉన్న సబ్ రిజిస్ట్రార్ దుప్పలపూడి అశోక్‌పైనా కేసు నమోదు చేశామని, త్వరలో అతడిని పట్టుకుంటామని మావల సీఐ కర్ర స్వామి మీడియాకు వెల్లడించారు. ఈ భూకుంభకోణంలో రియల్ ఎస్టేట్ ఏజెంట్లు, డాక్యుమెంట్ రైటర్ల పాత్రపైన ఆరా తీస్తున్నామని..? దీని వెనక ఎవరు ఉన్నా వదిలేది లేదని పోలీసులు వెల్లడించారు. ఇదే కాకుండా జిల్లాలో భూకబ్జాలు, రియల్ మోసాలు, అలాగే బెదిరించి భూములు లాక్కుంటే పోలీసులను ఆశ్రయించాలని సూచిస్తున్నారు.