స్థానిక సంస్థల ఎన్నికలపై సందిగ్థత
Doubt over local body elections:ఎన్నికల కోసం అంతా సిద్ధం.. ఓ వైపు రిజర్వేషన్లు సైతం ఖరారు చేశారు.. మేం ఎన్నికలకు సిద్ధమని ఎన్నికల కమిషన్ సైతం ప్రకటించింది.. ఇక నోటిఫికేషన్ వచ్చే సమయానికి హైకోర్టు చేసిన వ్యాఖ్యలు ఆశావహుల ఆశల మీద నీళ్లు చల్లినట్టయ్యింది.. ఇప్పట్లో ఎన్నికలు కష్టమేనని పలువురు నిపుణులు చెబుతున్నారు. అయితే, అదే సమయంలో కోర్టు చేసిన వ్యాఖ్యలతో ఎన్నికలు ఆగవని మరికొందరు స్పష్టం చేస్తున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం భయపడుతోందని ప్రతిపక్షాలు.. ఎట్టి పరిస్థితుల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లతోనే స్థానిక సమరానికి వెళ్తామని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇలా చాలా రోజులుగా స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో రాజకీయం సాగుతోంది. ప్రభుత్వం నిన్న సాయంత్రం చెప్పినట్టుగానే రిజర్వేషన్ల అమలుకు జీవో జారీ చేసింది. ఎన్నికల సంఘం సైతం తాము ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. ఎన్నికల నోటిఫికేషన్‌కు రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు సైతం ఇచ్చింది. మీరంతా సిద్ధంగా ఉండాలని స్పష్టం చేసింది.
శనివారం రాష్ట్రవ్యాప్తంగా ఎంపీటీసీ, జడ్పీటీసీలకు సంబంధించిన రిజర్వేషన్లకు సంబంధించి డ్రా కూడా తీశారు. మరోవైపు ప్రభుత్వం జారీ చేసిన జీవో విషయంలో రెడ్డి జాగృతి మాధవరెడ్డి కోర్టుకెక్కారు. జీవో రద్దు చేయాలని ఆయన తరుపు లాయర్ వాదించారు. గవర్నర్ దగ్గర బిల్లు ఉన్నప్పుడు జీవో ఇవ్వడం సరికాదని, అవసరమైతే మరో 2, 3నెలల సమయం కోరుతూ అఫిడవిట్ వేసుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది. దీనిపై రెండు రోజుల సమయం కావాలని ప్రభుత్వం కోరింది. దీంతో ఒకవేళ నోటిఫికేషన్ వచ్చినా దీనిపై విచారిస్తామని కోర్టు స్పష్టం చేసింది.
ఈ నేపథ్యంలోనే స్థానిక సంస్థల ఎన్నికలపై నీలనీడలు కమ్ముకున్నాయి. అసలు ఎన్నికలు ఉంటాయా..? ఉండవా..? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఏడాదిన్నర కావస్తున్నా ఎన్నికలు జరకపోవడంతో ఈసారైనా ఖచ్చితంగా ఎన్నికలు ఉంటయానుకుంటే కొత్త రకమైన సమస్య వచ్చిపడిందని ఆశావహులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే, కోర్టు ఈ వ్యవహారంలో కేవలం సందేహాలు మాత్రమే వ్యక్తం చేసిందని జీవోకు వ్యతిరేకంగా తీర్పు వచ్చే అవకాశం లేదని కొందరు స్పష్టం చేస్తున్నారు. బిల్లు గవర్నర్ వద్ద ఉండగా, జీవో ఇవ్వడం చెల్లదని కోర్టు తీర్పు ఇచ్చిందని ఇంకొందరి వాదన. ఇలా ఎన్నికల విషయంలో సందిగ్ధం నెలకొనగా అసలు ఎన్నికలు ఇప్పుడు ఉంటాయా..? ఉండవా..? అనేది సస్పెన్స్‌గా మారింది.