మీ సేవా కేంద్రాల నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలి

జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) పి. చంద్రయ్య

జిల్లాలోని మీ సేవా కేంద్రాల నిర్వాహకులు తమ కేంద్రాల నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) పి. చంద్రయ్య అన్నారు. సోమవారం క‌లెక్ట‌రేట్‌లో జిల్లా వ్యవసాయ అధికారి సురేఖ, ఈ – డిస్ట్రిక్ట్ మేనేజర్ సునీల్, మీసేవ కేంద్రాల నిర్వాహకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయ‌న‌ మాట్లాడుతూ మీసేవ కేంద్రాలు ప్రభుత్వానికి, ప్రజలకు వారిధిగా ఉంటున్నాయ‌ని అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు వేదికగా పని చేస్తున్నాయని స్ప‌ష్టం చేశారు. మీ సేవ కేంద్రాల నిర్వాహకులు తమ విధులను సమర్థవంతంగా నిర్వహించాలని తెలిపారు. మీ సేవ నిర్వాహకులు తమ కేంద్రాల పని వేళలను ఖచ్చితంగా పాటించాలని, వివిధ సేవలకు సంబంధించి ధరల పట్టికను ప్రతి మీ సేవ కేంద్రంలో ప్రజలకు కనిపించే విధంగా ప్రదర్శించాలని తెలిపారు.

నిర్దేశిత‌ రుసుముకు మించి వసూలు చేయకూడదని, దరఖాస్తు సమయంలో జాగ్రత్తలు వహించాలని తెలిపారు. ప్రతి మీ సేవ కేంద్రంలో హెల్ప్ లైన్ నెంబర్, సంబంధిత తహసిల్దార్ పేరు, మొబైల్ నెంబర్ తప్పనిసరిగా ప్రదర్శించాలని తెలిపారు. మీసేవ కేంద్రాల కాల పరిమితి ముగిసిన వారు మార్చి లోగా తమ అనుమతులను పునరుద్ధరించుకోవాలని తెలిపారు. మీసేవ కేంద్రం పొందిన వారు మాత్రమే కేంద్రాన్ని నిర్వహించాలన్నారు. వివిధ సేవల నిమిత్తం మీ సేవ కేంద్రానికి వచ్చే ప్రజలతో మర్యాదగా వ్యవహరించాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కనీస సౌకర్యాలు కల్పించాలని తెలిపారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అర్హత గల ప్రతి రైతుకు గుర్తింపు సంఖ్య కేటాయించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈ ప్రక్రియ నిర్వహించేందుకు మీ సేవా కేంద్రాలకు అవకాశం కల్పించిన‌ట్లు వెల్ల‌డించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రక్రియ నిర్వహించాలని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

 

Get real time updates directly on you device, subscribe now.

You might also like