కొత్త పార్టీ… ఇక్కడ నుంచే పోటీ…
-కొత్త పార్టీ స్థాపించనున్న కల్వకుంట్ల కవిత
-16, 20న మంచిర్యాలలో భారీ బహిరంగా సభ
-ఇదే సభలో కొత్త పార్టీ ప్రకటన చేయనున్న అధినేత్రి
-ఇక్కడ నుంచే పోటీ చేసేందుకు వ్యూహం
-ఇప్పటికే సర్వే చేయించిన కవిత
-సింగరేణి తనకు అండగా ఉంటుందనే ధైర్యం
-రెండు, మూడు రోజుల్లో పూర్తి స్పష్టత
Kalvakuntla Kavitha:తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ గురించే తెలంగాణ వ్యాప్తంగా చర్చ సాగుతోంది. ఆమె ఎమ్మెల్సీ రాజీనామా నేపథ్యంతో పాటు మంగళవారం (జనవరి 6) తెలంగాణ జాగృతి రాష్ట్ర విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో కొత్త పార్టీపై పూర్తి స్పష్టత ఇచ్చారు. ఈ సమావేశంలో రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, కొత్త పార్టీ ఏర్పాటు వంటి అంశాలపై ఈ సందర్భంగా చర్చించారు. 2026 ఫిబ్రవరి 16, 20వ తేదీన మంచిర్యాలలో భారీ బహిరంగా సభ ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయించినట్లు సమాచారం. ఇదే సభలో కొత్త పార్టీని ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇక్కడ నుంచే పోటీ చేస్తారా..?
కల్వకుంట్ల కవిత రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా మంచిర్యాల నుంచే బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. నిజామాబాద్ నుంచి కానీ, మంచిర్యాల నుంచి కానీ కవిత పోటీ చేయాలని ఆలోచించారు. అయితే, ఆమె మంచిర్యాల వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. కవిత గతంలో టీజీబీకేఎస్ గౌరవ అధ్యక్షురాలిగా పని చేశారు. ఇప్పుడు హెచ్ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే సింగరేణి కార్మికులు తమ వెంట కలిసివస్తారని ఆమె భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇక్కడే పార్టీ ప్రకటన, ఇక్కడ నుంచే పోటీ చేయాలనే ఆలోచనలో అధినేత్రి ఉన్నట్లు సమాచారం.
రహస్య సర్వే, అనుచరులతో మంతనాలు..
కవిత ఇప్పటికే ఓ సర్వే చేయించినట్లు తెలుస్తోంది. తాను మంచిర్యాల నుంచి పోటీ చేస్తే ఎలా ఉంటుంది..? ఏయే అంశాలు ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయి…? మిగతా పార్టీలు, నేతల పరిస్థితి…? ఇక్కడ పరిస్థితులు ఏంటి..? తనకు ఏ మేరకు మద్దతు లభిస్తుంది…? అటు నియోజకవర్గం నుంచి, ఇటు సింగరేణి నుంచి భవిష్యత్తులో ఎలా ఉండబోతోంది..? ఇలా అన్ని రకాల అంశాలతో సర్వే జరిగినట్లు సమాచారం. దీని ఆధారంగానే ఆమె ముందడుగు వేసినట్లు చెబుతున్నారు. అదే సమయంలో ఆమె మంచిర్యాలకు చెందిన నేతలు, కార్యకర్తలతో ఇప్పటికే ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసుకుని మంతనాలు చేయడం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక్కడి నుంచి పోటీ చేస్తే ఆమెకు ఉపయుక్తంగా ఉంటుందని సన్నిహితులు, కార్మిక నేతలు సూచించినట్లు సమాచారం. ఇలా అన్ని రకాలుగా ఆలోచించిన కవిత మంచిర్యాల నుంచి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది.
దీనిపై రెండు, మూడు రోజుల్లో పూర్తి స్థాయిలో స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.