ఉద్యోగాల పేరిట భారీ మోసం

-ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాలో వందల మంది సంఖ్యలో బాధితులు
-అనంత్ ఈ సొల్యూషన్, విద్యాదాన్ ఎన్జీవో ఆర్గనైజేషన్ పేరుతో నకిలీ జాబ్ మోసం
-కేంద్ర ప్రభుత్వ సీఎస్ఆర్ నిధులు కాజేసేందుకు... -నకిలీ ఉద్యోగాలను ఇప్పించి మోసం చేసిన ముఠా
-తప్పించుకొని తిరుగుతూ ఈ రోజు పట్టుబడ్డ ప్రధాన నిందితుడు
-ఐదుగురిపై ఆదిలాబాద్ వన్ టౌన్ లో కేసు, ముగ్గురి అరెస్ట్
-నిందితుల మొబైల్ ఫోన్లు, నకిలీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ స్వాధీనం
-వివరాలను వెల్లడించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

Massive fraud in the name of jobs:ఉద్యోగాల పేరుతో నిరుద్యోగ యువతను మోసం చేసిన భారీ కేసును ఆదిలాబాద్ వన్‌టౌన్ పోలీసు(Adilabad One Town Police)లు ఛేదించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు జెట్టబోయిన మధు కిరణ్ (45)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు 2013లో “అనంత ఈ సొల్యూషన్” పేరిట కంపెనీ స్థాపించి, ఔట్సోర్సింగ్ ద్వారా ఉద్యోగాలు ఇస్తామని చెప్పేవాడు. 2023లో సుజాత ఠాకూర్, నామిని సతీష్, లావణ్యలతో కలిసి “విద్యాధాన్ ఆర్గనైజర్స్” అనే సొసైటీ రిజిస్టర్ చేసి, కేంద్ర ప్రభుత్వ విద్యాంజలి 2.0 స్కీమ్ డబ్బులు కాజేసేందుకు ప‌థ‌కం వేశాడు. త‌మకు ప్రభుత్వ అనుమతులు ఉన్నాయని అబద్ధాలు చెప్పి నిరుద్యోగులను నమ్మబలికించాడు. వారికి వివిధ ప్రభుత్వ పాఠశాలలో, కళాశాలలో న‌కిలీ ఉద్యోగాలు వచ్చేలా చేశారు.

ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాల, ఉమ్మడి వరంగల్, ఖమ్మం తదితర జిల్లాల్లో ఏజెంట్ల ద్వారా ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఒక్కొక్కరి వద్ద ల‌క్ష రూపాయ‌ల నుంచి రెండున్న‌ర ల‌క్ష‌ల వ‌ర‌కు వసూలు చేసి, నకిలీ అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చేవాడు. ఇలా వందల సంఖ్యలో నిరుద్యోగులను మోసం చేశాడు. ఈ ముఠా రాష్ట్రవ్యాప్తంగా 240 దాదాపు మంది అభ్యర్థులను మోసం చేసిన‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు. వివిధ పాఠశాలలు, కళాశాలలో నకిలీ అపాయింట్మెంట్ ఆర్డర్లతో ఉద్యోగాలు కల్పించి వారికి మూడు నెలలు వేతనం వీరే ఇచ్చేవారు. ఆ తర్వాత వేతనం అందకపోయేసరికి బాధితులు వివిధ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

దీంతో వీరికి సహకరించి ఏజెంట్లుగా ఉన్న రాహుల్, కోవా విఠ‌ల్ (బోథ్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్) వరలక్ష్మిపై ఇదివరకే ప‌లు స్టేషన్లలో కేసులు నమోదు చేసి, అరెస్టు చేసి రిమాండ్ కు తరలించడం జరిగిందని తెలిపారు. ఈ రోజు జట్టబోయిన మధు కిరణ్ (45), మాదాసి సుధాకర్ (48), నమ్మని సతీష్ ల‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులను త‌రువాత‌ పోలీస్ కస్టడీలోకి తీసుకొని ఇంకా ఎవరి పాత్ర ఉన్నదని అంశంపై విచారణ చేస్తామ‌ని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ (District SP Akhil Mahajan) వెల్ల‌డించారు.

ప్ర‌జ‌ల‌కు ఎస్పీ విజ్ఞ‌ప్తి..
ప్రజలు ఉద్యోగాల పేరుతో మోసం చేసే ముఠా సభ్యులను, డబ్బులు అడిగే ముఠాలను నమ్మవద్దని, అప్రమత్తతో వ్యవహరించాలని, డబ్బులతో ప్రభుత్వ ఉద్యోగాలు రావని కష్టపడి పరీక్షల ద్వారా ఉద్యోగాలను సాధించాలి తెలిపారు. నిరుద్యోగులను మోసం చేసే వారిపై, నకిలీ ఉద్యోగాల పేరుతో మోసం చేసే వారిపై జిల్లా పోలీసు యంత్రాంగం కఠిన చర్యలు తీసుకుంటుంద‌న్నారు. నిందితులను పట్టుకోవడంలో కృషిచేసిన వన్ టౌన్ ఇన్స్పెక్టర్ సునీల్ కుమార్, ఐటీ కోర్ ఆర్ఎస్ఐ బి గోపికృష్ణ సిబ్బందిని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. విలేకరుల సమావేశంలో ఆదిలాబాద్ డిఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి, వన్ టౌన్ ఇన్స్పెక్టర్ బి సునీల్ కుమార్, ఎస్సైలు గోపికృష్ణ, నాగనాథ్, అశోక్ సిబ్బంది త్రిశూల్ తదితరులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like