అక్క‌డా.. ఇక్క‌డా.. మంత్రికి నిర‌స‌న సెగ‌

Protest against Minister Vivek: మంత్రి వివేక్(Minister Vivek)కి రెండు చోట్ల నిర‌స‌న సెగ త‌గిలింది. సొంత నియోజ‌క‌వ‌ర్గంతో పాటు, దుబ్బాకలో సైతం రైతులు ఆయ‌న‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. దీంతో మంత్రి సైతం అస‌హ‌నానికి గుర‌య్యారు. వివ‌రాల్లోకి వెళితే….  తమ ప్రాంతంలో ప‌లు  సమస్యలపై మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీ ప్రజలు మంత్రిని నిలదీశారు.  రహదారి పనులు కూడా చేపట్టకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండేళ్లయినా ఒక్క అభివృద్ధి పని కూడా కనిపించడం లేదని ప్రశ్నల వర్షం కురిపించారు.

స్థానికుల ప్రశ్నలతో మంత్రి వివేక్ తీవ్ర అసహనానికి గురయ్యారు. సమస్యలపై నిలదీసిన ప్రజలతోనే మంత్రి వివేక్ ర‌హదారి అవసరమైతే ప్రభుత్వాన్ని అడుక్కోండంటూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. దీంతో విస్తుపోవ‌డం ప్ర‌జ‌ల వంతైంది.. తాము ఓటేసింది వివేక్‌కు అయితే ప్ర‌భుత్వాన్ని అడ‌గండంటూ అస‌హ‌నానికి గురికావ‌డం ఏమిట‌ని ప్ర‌శ్నిస్తున్నారు. మ‌రి మంత్రి ప్ర‌భుత్వంలో భాగ‌మే కదా..? మ‌రి ఏ ప్ర‌భుత్వాన్ని అడ‌గ‌మ‌న్నారంటూ ప్ర‌జ‌లు ఆశ్చ‌ర్య‌పోతున్నారు.  సమస్యల గురించి వినకుండా, దురుసుగా వ్యవహరించారంటూ మంత్రి వివేక్ తీరుపై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఆయ‌నకు దుబ్బాక‌లో సైతం రైతుల నుంచి నిర‌స‌న వ్య‌క్తం అయ్యింది.   రెండు లక్షల రుణమాఫీ ఎటు పోయే రైతు భరోసా ఎప్పుడు ఇస్తారు అంటూ.. రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామిని దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని ధర్మాజీపేటలోని రైతులు ప్ల‌ కార్డులతో నిరసన వ్యక్తం చేస్తూ అడ్డుకున్నారు. మంగళవారం దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు హాజ‌రయ్యారు మంత్రి వివేక్‌… దీంతో ఆయ‌న‌ను ధర్మాజీపేట రైతులు నిలదీశారు. ప్రజా ప్రభుత్వమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని చెప్పుకుంటూ… రైతులకు మాత్రం తీరని అన్యాయం చేస్తోంద‌ని దుయ్య‌బ‌ట్టారు.  వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా, రుణమాఫీ నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.

You might also like