మేడారం.. భ‌క్త‌జ‌నం..

Medaram:ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క-సారలమ్మ వనదేవతలను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున త‌ర‌లివ‌స్తున్నారు. జాత‌ర స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతుండ‌టం, సంక్రాంతి సెల‌వులు కూడా ముగుస్తుండ‌టంతో భారీగా జ‌న‌సందోహం పెరిగింది. ఒక్క శుక్ర‌వార‌మే దాదాపు పది లక్షల మంది భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. సమ్మక్క-సారలమ్మకు నిలువెత్తు బంగారాన్ని సమర్పిస్తున్నారు. సంక్రాంతి పండుగకు వచ్చిన వారంతా మేడారం తరలివచ్చారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, మహారాష్ట్ర నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చి అమ్మవార్లను దర్శించుకున్నారు.

జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి, సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలపై ఎత్తుబెల్లం, ఒడిబియ్యం, పసుపు, కుంకుమ సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఉదయం పూట గద్దెల వద్దకు భక్తులను అనుమతించిన పోలీసులు 10 గంటల సమయంలో రద్దీ పెరగడంతో గ్రిల్స్‌కు తాళాలు వేసి బయట నుంచే దర్శనం కలిగించారు. కల్యాణ మండపం వద్ద ఉన్న క్యూ ద్వారానే భక్తులను దర్శనానికి పంపించారు. ఆర్టీసీ బస్టాండ్‌ నుంచి క్యూ ద్వారా వచ్చే భక్తులను గద్దెల వద్దకు వెళ్లకుండా గేట్లను మూసివేశారు. ప్రోటోకాల్‌ దర్శనాలని కొందరిని దర్జాగా గద్దెల వద్దకు అనుమతించగా, సామాన్య భక్తులు మాత్రం దర్శనానికి గంటల తరబడి వేచిఉండాల్సి వచ్చింది.

You might also like