ఉపాధి హామీ కూలీలను ఢీ కొట్టిన టిప్పర్… నలుగురు మృతి
Tipper hits employment guarantee workers..Four dead:తెల్లవారగానే వారి బతుకులు తెల్లారిపోయాయి. రెక్కాడితే గాని డొక్కాడని ఆ పేద కూలీలు.. రోజులాగే ఉపాధి హామీ పనుల కోసం బయలుదేరారు. అంతలోనే మృత్యువు టిప్పర్ లారీ రూపంలో దూసుకొచ్చింది.
ఉపాధి హామీ కూలీలను టిప్పర్ ఢీకొట్టడంతో.. నలుగురు మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. వారి పరిస్థితి కూడా విషమంగా ఉంది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ కాకినాడలోని కొవ్వూరు బ్రిడ్జి దగ్గర జరిగింది. కొందరు కూలీలు ఉదయాన్నే ఉపాధి హామీ పనుల్లో పాల్గొనేందుకు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నారు. అదే సమయంలో అటుగా అత్యంత వేగంగా దూసుకొచ్చిన ఒక టిప్పర్ లారీ.. నడుచుకుంటూ వెళ్తున్న కూలీలను బలంగా ఢీకొట్టింది. లారీ వేగం ఎక్కువగా ఉండటంతో కూలీలు ఎగిరి పడ్డారు. ఈ ప్రమాదంలో నలుగురు కూలీలు తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే కన్నుమూశారు.
ప్రమాదంలో మరణించిన వారిలో వాసంశెట్టి సత్యవతి (60), పాలిక కృష్ణవేణి (35), చిట్టెమ్మ (45), చెల్లూరి అన్నవరం (45)లు ఉన్నారు.ఈ దుర్ఘటనలో తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరు కూలీలు మట్టపర్తి అరుణ కుమారి, పాలిక నాగమణిని కాకినాడ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి (GGH) తరలించారు. ప్రస్తుతం వారికి అత్యవసర విభాగంలో చికిత్స అందుతుండగా.. వీరి పరిస్థితి కూడా అత్యంత విషమంగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.
ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఉపాధి పనులకని వెళ్లిన తమ వారు కొద్దిసేపటికే శవాలై పడి ఉండటం చూసి మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు ఘటనా స్థలానికి చేరుకుని కన్నీరు మున్నీరుగా విలపించారు. వారి రోదనలు అక్కడి వారిని కలచివేశాయి. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.