కొండగట్టు అంజన్న హుండీ ఆదాయం ఎంతంటే…?
Kondagattu Hundi Income:కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ హుండీ లెక్కింపు శుక్రవారం రోజు పూర్తి చేశారు. ఇటీవల నిర్వహించిన హనుమాన్ పెద్ద జయంతితో పాటు గడిచిన 34 రోజుల హుండీ ఆదాయాన్ని ఈ సందర్భంగా లెక్కించారు. గడిచిన 34 రోజుల హుండీ ఆదాయం 1 కోటి 8 లక్షల 64 వేల 164 రూపాయలు వచ్చినట్లు ఆలయ సిబ్బంది తెలిపారు. ఈఓ ఎస్.అంజనారెడ్డి , ఏఈఓ హరిహరనాథ్, దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ రాజమౌళి సమక్షంలో భారీ భద్రత నడుమ హుండీల లెక్కింపు పూర్తి చేశారు. లెక్కింపు సందర్భంగా వచ్చిన బంగారం, వెండిని తిరిగి హుండీలో భద్రపరిచినట్లు తెలిపారు.
ఫిబ్రవరిలో 43 రోజుల హుండీ ఆదాయం కోటి 16 లక్షల 4 వేల 438 రూపాయల ఆదాయం వచ్చిన విషయం తెలిసిందే. ఈసారి కేవలం 34 రోజులకే పెద్దమొత్తంలో ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో వెల్లడించారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో వివిధ రకాల సేవలు, ప్రత్యేక పూజలు, హుండీ కానుకల ద్వారా రూ.21.98 కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకుని రాష్ట్రంలో నాలుగో స్థానంలో నిలిచింది. ప్రతి మంగళవారం, శనివారం రోజుల్లో వేలాదిగా భక్తులు ఆలయానికి తరలివస్తుంటారు. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున కొండగట్టుకు చేరుకుంటున్నారు. అలాగే ఆలయంలో నిర్వహించే వివిధ ఆర్జిత సేవలు, వాహన పూజలు, తలనీలాల సమర్పణ, హుండీ కానుకలు దేవస్థాన ఆదాయాన్ని మరింత పెంచుతున్నాయి.