సీసీఐ పునరుద్ధరణపై ప్రభుత్వ వైఖరి స్పష్టం చేయాలి

సీఎం రేవంత్‌కు కేటీఆర్ లేఖ

ఆదిలాబాద్ జిల్లాలోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) కర్మాగారం పునరుద్ధరణపై కాంగ్రెస్ ప్రభుత్వం తన అధికారిక వైఖరి వెంటనే ప్రకటించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. సీసీఐ పునరుద్ధరణ అనేది కేవలం ఒక పరిశ్రమకు సంబంధించిన అంశం మాత్రమే కాదని, వేలాది కుటుంబాల జీవనాధారం, ఆదిలాబాద్ జిల్లా పారిశ్రామిక భవిష్యత్తు, తెలంగాణ అభివృద్ధికి సంబంధించిన కీలక అంశమని కేటీఆర్ పేర్కొన్నారు.

ఈ నెల 15న సీసీఐ సాధన సమితి ప్రతినిధులు, బీఆర్ఎస్ నేతలతో కలిసి కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి. కుమారస్వామిని ఢిల్లీలో కలిసి సీసీఐ పునరుద్ధరణపై విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. ఆ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.250 కోట్ల పెట్టుబడితో ముందుకు వస్తే ఆదిలాబాద్ సీసీఐ ప్లాంట్ పునరుద్ధరణ సాధ్యమవుతుందని కేంద్ర మంత్రి వెల్లడించినట్లు కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రతిపాదనలు పంపకపోవడం, రాయితీలపై స్పష్టత ఇవ్వకపోవడం వల్లే ప్రక్రియ ఆలస్యమవుతోందని కేంద్ర మంత్రి తెలిపినట్లు వివరించారు.

అసెంబ్లీ ఎన్నికల సమయంలో సీసీఐ పునరుద్ధరణపై హామీ ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ దిశగా చర్యలు తీసుకోలేదని కేటీఆర్ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేయడంలోనూ, ప్రత్యామ్నాయ కార్యాచరణ రూపొందించడంలోనూ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానమంత్రికి లేఖ రాశారని, తాను పరిశ్రమల శాఖ మంత్రిగా కేంద్రానికి పలుమార్లు ప్రతిపాదనలు పంపినట్లు గుర్తు చేశారు. టీఎస్-ఐపాస్ తరహా రాయితీలు కల్పించేందుకు, అవసరమైతే కేంద్ర-రాష్ట్ర భాగస్వామ్యంతో పరిశ్రమ నిర్వహించేందుకు, కేంద్రం ముందుకు రాకపోతే రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహించేందుకు కూడా అప్పట్లో సిద్ధమని తెలిపినట్లు పేర్కొన్నారు.

ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర స్పందన కోసం ఎదురుచూస్తోందని పేర్కొన్న కేటీఆర్, ఇకనైనా ప్రభుత్వం చొరవ చూపి సీసీఐ పునరుద్ధరణకు అవసరమైన ప్రతిపాదనలు పంపాలని కోరారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారిక వైఖరి, కేంద్రానికి పంపిన ప్రతిపాదనలు, రూ.250 కోట్ల పెట్టుబడి, టీఎస్-ఐపాస్ రాయితీలు, కేంద్ర-రాష్ట్ర భాగస్వామ్యం, రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా పరిశ్రమను పునరుద్ధరించే కార్యాచరణ తదితర ఆరు అంశాలపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.

సీసీఐ పునరుద్ధరణ అంశాన్ని రాజకీయాలకు అతీతంగా పరిగణించి, ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి, వేలాది కుటుంబాల ఉపాధి దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సానుకూల నిర్ణయం తీసుకోవాలని కేటీఆర్ తన లేఖలో విజ్ఞప్తి చేశారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like