యువతకు ఉద్యోగాలే లక్ష్యం..
మంత్రి గడ్డం వివేక్
యువత ప్రభుత్వ ఉద్యోగాల్లో పెద్ద సంఖ్యలో ఎంపికై రాష్ట్రస్థాయిలో సత్తా చాటాలని మంత్రి గడ్డం వివేక్ పిలుపునిచ్చారు. కాకా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎస్‌ఐ, కానిస్టేబుల్ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం చెన్నూరులో ఏర్పాటు చేసిన కాకా ఫ్రీ కోచింగ్ సెంటర్‌ను మంత్రి వివేక్, ఎంపీ వంశీకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రతిభ ఉన్న యువతకు ఆర్థిక పరిస్థితులు అడ్డంకిగా మారకూడదనే లక్ష్యంతో కాకా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కోచింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. చెన్నూరు ప్రాంతం నుంచి అత్యధిక సంఖ్యలో ఎస్‌ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులు ఎంపికై రాష్ట్రస్థాయిలో చెన్నూరుకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
కేసులు కాదు.. ఉద్యోగాలు కావాలి: ఎంపీ వంశీకృష్ణ
ఎంపీ గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ.. “నీళ్లు, నిధులు, నియామకాలు” అనే నినాదంతో సాధించుకున్న తెలంగాణలో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. యువతను రాజకీయంగా రెచ్చగొట్టడం కాకుండా వారి భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన అవసరం ఉందన్నారు. నిరుద్యోగ యువత విదేశీ భాషలు నేర్చుకుని అంతర్జాతీయ స్థాయిలో ఉద్యోగ అవకాశాలు పొందడాన్ని తప్పుబట్టడం సరికాదన్నారు. “యువతకు కేసులు కావాలా.. ఉద్యోగాలు కావాలా? ఒక్కసారి ఆలోచించాల”ని ఎంపీ వంశీకృష్ణ సూచించారు.
కేటీఆర్ ఒక్కరే అమెరికా వెళ్లాలా? తెలంగాణ యువత విదేశాల్లో ఉద్యోగాలు చేయకూడదా? అని ప్రశ్నించారు. మంత్రి వివేక్ చొరవతో TOMCOM ద్వారా తెలంగాణ నిరుద్యోగ యువతకు విదేశాల్లోనూ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రభుత్వం అవకాశాలను కల్పిస్తుంది.. వాటిని అందిపుచ్చుకుని జీవితాలను మార్చుకోవాల్సిన బాధ్యత యువతదే అని ఎంపీ వంశీకృష్ణ స్పష్టం చేశారు. కార్యక్రమంలో కలెక్టర్ కుమార్ దీపక్, డీసీపీ భాస్కర్, అధికారులు, కాకా ఫౌండేషన్ ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, యువత, పోటీ పరీక్షల అభ్యర్థులు పాల్గొన్నారు.