బొగ్గు గనిలో రూఫ్‌ఫాల్… కార్మికుడికి తీవ్రగాయాలు…
సింగరేణి సంస్థ రామగుండం ఏరియా 1 జీడీకే లెవన్ ఇంక్లైన్ బొగ్గు గనిలో పైకప్పు కూలడంతో కార్మికుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఉదయం షిఫ్టులో ఎల్ హెచ్ డి సెక్షన్ లో 55 లెవెల్ వద్ద విధులు నిర్వహిస్తున్న సాగర్ అనే కార్మికుడి పై పైకప్పు కూలడంతో తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన తోటి కార్మికులు అధికారులకు సమాచారం అందించగా గాయపడ్డ సాగర్ ను సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కార్మికుడిని వివిధ కార్మిక సంఘాల పరామర్శించారు. ప్రమాద ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
వారం రోజుల కిందట ఇదేగనిలో పైకప్పు కూలడంతో నలుగురు కార్మికులకు గాయాలు కాగా భారీ యంత్రం బొగ్గు పొరల కింద కూరుకుపోయింది. వరుస ప్రమాదాలతో కార్మికులు భయాందోళనకు గురవుతున్నారు. పని స్థలాలో సేఫ్టీ పాటించకపోవడం ,యాజమాన్యానికి బొగ్గు ఉత్పత్తి పై ఉన్న శ్రద్ధ కార్మికుల రక్షణ పై లేకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని కార్మిక సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు . గనిలో జరుగుతున్న వరుస ప్రమాదాలపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ మైన్ సేఫ్టీ అధికారులతో విచారణ జరిపించి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.