కాంగ్రెస్ నేతల రాస్తారోకో

- ఎమ్మెల్సీ తాతా మధు క్షమాపణ చెప్పాలని డిమాండ్
- భారీగా పాల్గొన్న కాంగ్రెస్ శ్రేణులు
- దూరంగానే సిరంగి శంకర్ వర్గం

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై ఎమ్మెల్సీ తాతా మధు అహంకారపూరితంగా, అనుచిత వ్యాఖ్యలు చేసి కించపరిచారని ఆరోపిస్తూ తాండూర్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం తాండూర్ ఐబి చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పెద్దబోయిన శంకర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పదవికి ఉన్న గౌరవాన్ని కించపరిచేలా మాట్లాడటం ప్రజాస్వామ్య విలువలను అవమానించడమేనని అన్నారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్సీ తాతా మధు వెంటనే వెనక్కి తీసుకుని బహిరంగంగా క్షమాపణ చెప్పాలన్నారు.

తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ప్రజాప్రతినిధులు హుందాతనంతో వ్యవహరించాలని, భవిష్యత్తులో ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.

కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, జిల్లా ఉపాధ్యక్షుడు సూరం రవీందర్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గట్టు మురళీధర్, మాజీ జడ్పీటీసీ సభ్యులు సాలిగామ బానయ్య, వివిధ గ్రామాల సర్పంచులు, వార్డు సభ్యులు, జిల్లా, మండల నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

మరో వర్గం దూరం..
ఈ ఆందోళనకు కాంగ్రెస్ లో మరో వర్గం పాల్గొనలేదు. మాజీ ఎంపీపీ సిరంగి శంకర్ వర్గం దూరంగా ఉంది. మొదటి నుండి ఇక్కడ కాంగ్రెస్ లో వర్గపోరు కొనసాగుతోంది. ఏ కార్యక్రమం జరిగినా రెండు వర్గాలుగా విడిపోయి నిర్వహిస్తున్నారు. ఈ మధ్య కాలంలో రెండు వర్గాలు కలిసి పోయాయని ప్రచారం జరిగింది.. కానీ, అదంతా ఉట్టిదే అని తేలిపోయింది. ఈ వర్గపోరు ముగిసి.. అందరు కలసి కార్యక్రమాలు చేసేది ఎప్పుడో అని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

You might also like